Russia Ukraine War: Condom Sales Raised In Russia Over Fears Of Shortage Due To Sanctions - Sakshi
Sakshi News home page

Russia Condom Sales: రష్యాలో కండోమ్‌లకి కటకట.. స్టోర్లలో అవుటాఫ్‌ స్టాక్‌ బోర్డులు

Published Mon, Mar 21 2022 2:57 PM | Last Updated on Mon, Mar 21 2022 8:23 PM

Condom sales Raised in Russia over fears sanctions will cause shortages - Sakshi

నాటోతో వచ్చిన ముప్పు సంగతేమిటో కానీ.. ఉక్రెయిన్‌పై పుతిన్‌ తలపెట్టిన యుద్ధం రష్యన్లకు ఇప్పటికప్పుడు కష్టాలను తెచ్చిపెడుతోంది. యాపిల్‌ ఫోన్లు, మెక్‌డొనాల్డ్‌ బర్గర్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. మరోవైపు చాపకింద నీరులా ఆ దేశంలో కండోమ్‌ల కొరత ఏర్పడుతోంది. అక్కడి జనాలు అవసరానికి మించి గర్భనిరోధక సాధనమైన కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. 

రష్యలోని సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ స్టోర్లలో కండోమ్‌ల అమ్మకాలు భారీ స్థాయిలో సాగుతున్నాయి. డూరెక్స్‌ బ్రాండ్‌తో కండోమ్స్‌ తయారు చేసే రెకిట్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది మార్చితో పోల్చితే మొదటి పదిహేను రోజుల్లోనే రష్యాలో కండోమ్‌ల అమ్మకాలు 170 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు సగటు అమ్మకాలను పోల్చినా ఈ ఏడాది  36 శాతం అమ్మకాలు పెరిగాయి. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ అమెరికా సహా పలు యూరప్‌ కంట్రీలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ దేశాలకు చెందిన కంపెనీలో రష్యాతో తమ వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటున్నాయి. దీంతో కండోమ్‌లు దేశంలో లభించవేమోనన్న పుకారు బయల్దేరింది. ఫలితంగా రష్యన్లు భవిష్యత్తు అవసరాల కోసం అన్నట్టుగా వేలం వెర్రిగా మెడికల్‌ స్టోర్లు, సూపర్‌ మార్కెట్లలో కండోమ్‌ ప్యాకెట్లను కొనేస్తున్నారు.

కండోమ్‌లు భారీ ఎత్తున అమ్ముడైపోవడం పట్ల అక్కడి మార్కెట్‌ నిపుణులు స్పందిస్తూ వాస్తవానికి రష్యపై ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలకు కండోమ్‌ తయారీ కంపెనీలు పెద్ద సంబంధం లేదు. కానీ కండోమ్‌ తయారీలో ఉపయోగించే లేటెక్స్‌ పదార్థాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే యుద్ధం కారణంగా డాలర్‌తో పోల్చితే రూబుల్‌ విలువ భారీగా పడిపోయింది. దీంతో లేటెక్స్‌ దిగుమతి చేయాలంటే భారీ ఖర్చు తప్పదు. అంతిమంగా ఈ భారం ధరల పెరుగుదల రూపంలో ప్రజలపైనే పడుతుంది.

ఆర్థిక ఆంక్షల ప్రభావం, రూబుల్‌ విలువ పడిపోవడంతో అక్కడి బిజినెస్‌ సెక్టార్‌కి చెందినవారు ఆందోళనగా ఉన్నారు. అందువల్లే ఏ వస్తువుకు డిమాండ్‌ ఉన్న ఎక్కువ రేటుకు అమ్ముతూ సాధ్యమైనంత వరకు లాభాలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వెరసి రష్యా చేపట్టిన యుద్ధం ఆ దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement