తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువైందంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. రెండేళ్ల పాటు విచారణ జరిగిన ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఏమని ఇచ్చింది.
చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్‌కు చెందిన పీ. ఢిల్లీ బాబు అనే వ్యక్తికి మూగ జీవాలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజు వీధికుక్కలకు బిస్కెట్లను ఆహారంగా అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఢిల్లీ బాబు ఎప్పటిలాగే కుక్కలకి బిస్కెట్లు అందించేందుకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ ఐటీసీ సంస్థకు చెందిన సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లు ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు.
అనంతరం ఆ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించగా అందులో ఓ తప్పు జరుగుతున్నట్లు గుర్తించారు. సంస్థ రేపర్ (చాక్లెట్ కవర్) మీద 16 బిస్కెట్లు ఉన్నాయని చెప్పింది. కానీ తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్‌లో రేపర్ మీద పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కెట్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరణ కోసం స్థానిక స్టోర్‌తో పాటు ఐటీసీకి మెయిల్ చేసినా స్పందన లేదు.
ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్
దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి 2021 డిసెంబర్ నెలలో చెన్నైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను తయారు చేస్తుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే కంపెనీ వినియోగదారులను ప్రతిరోజూ రూ.29 లక్షలు మేర మోసం చేస్తోంది అంటూ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ప్రతిస్పందనగా ఐటీసీ సంస్థ బిస్కెట్లను సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తారని వాదించింది. ఇరు వాదనల విన్న కోర్టు సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించింది. ప్రతి ప్యాకెట్‌పై పేర్కొన్న నికర బరువు 76 గ్రాములు. అయితే, 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమేనని కోర్టు గుర్తించింది.
అసంతృప్తికి గురైన కోర్టు
2011 నాటి లీగల్ మెట్రాలజీ నిబంధనలు ముందుగా ప్యాక్ చేసిన వస్తువులలో గరిష్టంగా 4.5 గ్రాముల వ్యత్యాసాన్ని అనుమతించాయని కోర్టుకు విన్నవించుకుంది. అయితే, అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే ఇటువంటి మినహాయింపులు చెల్లుబాటు అవుతాయని కోర్టు సంస్థ ఇచ్చిన వివరణను తిరస్కరించింది. బిస్కెట్లు కాలక్రమేణా బరువు తగ్గవు కాబట్టి నియమం వర్తించదు అని స్పష్టం చేసింది. పైగా, రేపర్‌పై ఐటీసీ 16 బిస్కెట్లను పేర్కొన్నందున, సంఖ్య కాకుండా.. బరువు ఆధారంగా బిస్కెట్లు విక్రయించారనే వాదన కూడా కొట్టివేసింది.
లక్ష చెల్లించాలని ఆదేశాలు
బిస్కెట్ ప్యాకెట్‌లో రేపర్‌పై పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కట్ తక్కువగా ప్యాక్ చేశారంటూ ఐటీసీకి వినియోగదారుల కోర్టు రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఫిర్యాదు దారుడు ఢిల్లీ బాబుకు చెల్లించాలని ఐటీసీ సంస్థకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment