Survey Says Consumers Worried About The Safety And Performance Of Electric - Sakshi
Sakshi News home page

Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్‌ విషయాలు

Published Tue, Aug 23 2022 9:20 AM | Last Updated on Tue, Aug 23 2022 10:36 AM

Consumers concerned about safety and performance of electric scooters: Survey - Sakshi

ముంబై: ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా భద్రత, పనితీరుకే ప్రాధాన్య మిస్తున్నారు. ఈ వాహనాలు తరచూ అగ్నిప్రమాదాలకుగురవుతుండటంతో..ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనే విషయంలోవెనక్కి తగ్గుతున్నారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్‌ నిర్వహించిన  ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎలక్ట్రిక్‌ స్కూటరు భద్రత, పనితీరుపై తమకు అంతగా నమ్మకం లేదనే వారి సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 32 శాతానికి పెరిగింది.

గతేడాది ఆగస్టులో ఇది కేవలం 2 శాతంగా నమోదైంది. 292 జిల్లాల్లోని 11,000 మంది పైచిలుకు వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించారు. ఇందులో 47 శాతం మంది పెద్ద నగరాలు, 33 శాతం మంది ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందినవారు కాగా.. 20 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.  

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రెండు డజన్లకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ) అగ్నిప్రమాదాలకు గురైన ఉదంతాలు నమోదయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా లోపాలున్న వాహనాల బ్యాచ్‌లను వెంటనే ఉపసంహరించాలని లేదా భారీ జరిమానా విధించాల్సి వస్తుందని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 21న హెచ్చరించింది. దీంతో 7,000 పైగా వాహనాలను కంపెనీలు వెనక్కి రప్పించాయి. మరోవైపు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దారులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ సెంటర్‌ ఫర్‌ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిపుణులతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది.  

మరిన్ని వివరాలు.. 
♦ విద్యుత్‌యేతర వాహనాలు, కిక్కిరిసిన ప్రజా రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ-స్కూటర్లపై చాలా మంది ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే పనితీరు, భద్రతపైనే ఆందోళన పెరుగుతోంది.  
♦ తమకు గానీ తమ కుటుంబ సభ్యులకు గానీ వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్‌ను కొనే ఆలోచన లేకపోవడానికి.. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమని 5 శాతం మంది తెలిపారు. వాటిని కొనేంత నిధులు తమ దగ్గర లేవని 7 శాతం మంది చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే చాలా వాహనాలు ఉన్నాయని, మరో టూ-వీలర్‌ కొనే యోచనేదీ లేదని 9 శాతం మంది పేర్కొన్నారు. 
♦ ఈవీలనేవి వేలం వెర్రిలాంటివని, ఈ ధోరణి త్వరలోనే తగ్గిపోతుందని 2 శాతం మంది పేర్కొన్నారు.   (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్‌)
కేవలం ఒక్క శాతం కుటుంబాలు మాత్రమే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమపై ఉందని నివేదిక పేర్కొంది.  
♦ ఈ-స్కూటర్లు, బ్యాటరీల భద్రతా ప్రమాణాలను రూపొందిస్తున్నప్పటికీ .. అనేక వర్గాల ప్రమేయం ఉన్నందున, ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తోంది. (ఇన్ఫోసిస్‌ వేరియబుల్‌ పే కోత)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement