Counterpoint Research: India has 38 billion Mobile Phone Market In 2021 Details Inside - Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 38 బిలియన్‌ డాలర్లు

Published Tue, Feb 1 2022 8:45 AM | Last Updated on Tue, Feb 1 2022 11:02 AM

Counterpoint Research Says India has 38 billion Mobile Phone Market In 2021 - Sakshi

న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్‌ (కంపెనీల నుంచి మార్కెట్‌కు సరఫరా/ఎగుమతులు) 2021లో 11 శాతం పెరిగి 169 మిలియన్‌ యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్‌ ఆదాయం 38 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. వార్షికంగా చూసుకుంటే ఇది 27 శాతం వృద్ధిగా పేర్కొంది. 2021 డిసెంబర్‌ త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం షిప్‌మెంట్‌ తగ్గినా కానీ, పూర్తి ఏడాదికి 11 శాతం వృద్ధి చెందినట్టు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ వివరించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో సరఫరా సమస్యలు తయారీపై ప్రభావం చూపించినట్టు తెలిపింది. ‘‘భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 2021లో మంచి వినియోగ డిమాండ్‌ను చూసింది. సరఫరా సమస్యలు, సెకండ్‌ వేవ్‌ తీవ్రత, అంతర్జాతీయంగా విడిభాగాల కొరత, ధరల పెంపు ఉన్నా కానీ, స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో మెరుగైన పనితీరు నమోదైంది’’ అని కౌంటర్‌ పాయింట్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ప్రాచిర్‌ సింగ్‌ తెలిపారు.  

2021 షిప్‌మెంట్‌ గణాంకాలు 
- మధ్య, అధిక ధరల విభాగంలో ప్రమోషన్లు, డిస్కౌంట్‌లతో ధరలు అందుబాటులో ఉన్నందున రీప్లేస్‌మెంట్‌ (పాత ఫోన్‌ తీసేసి కొత్తది కొనుగోలు చేయడం) డిమాండ్‌ జోరందుకుంది.  
- దీనికితోడు రుణాలకు సంబంధించి మంచి ఆప్షన్లు ఉండడం 11 శాతం వృద్ధికి మద్దతుగా నిలిచింది.  
- 2021 చివరి రెండు నెలల్లో డిమాండ్‌ సరఫరాను మించింది.  
- 2021 అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో వార్షికంగా స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్‌లు 8 శాతం క్షీణించాయి. 2022 మొదటి మూడు నెలల్లో సరఫరా మెరుగుపడొచ్చు. 
- దేశీయంగా షావోమీ 24 శాతం స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం ఫోన్ల (రూ.30వేలకు పైన) విభాగంలో వార్షికంగా 2021లో 258 శాతం వృద్ధి నమోదు చేసింది. 
- శామ్‌సంగ్‌ 18 శాతం షిప్‌మెంట్‌తో రెండో స్థానంలో ఉంది. రూ.20,000–45,000 ధరల విభాగంలో 28 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. 
- వివో 15 శాతం, రియల్‌మీ 14 శాతం, ఒప్పో 10 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
- రియల్‌మీ వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న బ్రాండ్‌గా ఉంది. డిసెంబర్‌ త్రైమాసికంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.  
- వన్‌ప్లస్‌ భారత్‌ మార్కెట్లోనే అత్యధిక షిప్‌మెంట్‌ను 2021లో నమోదు చేసింది. ప్రీమియం ఫోన్ల విభాగంలో 19 శాతంతో రెండో స్థానంలో ఉండగా, అందుబాటు ధరల్లోని ప్రీమియం విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉంది. 
- 2021లో యాపిల్‌ సైతం వార్షికంగా 108 శాతం వృద్ధిని చూపించింది. ప్రీమియం విభాగంలో 44 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది.  
- 5జీ ఫోన్ల షిప్‌మెంట్‌ 2021లో 555 శాతం పెరిగింది. వివో 19 శాతంతో మార్కెట్‌ లీడర్‌గా ఉంది. 
- ఫ్యూచర్‌ ఫోన్ల విభాగలో 86 మిలియన్‌ యూనిట్ల సరఫరా నమోదైంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా ఉంది.  
- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) భారత మొబైల్‌ తయారీకి ఎంతో మద్దతునిచ్చి నట్టు, యాపిల్, శామ్‌సంగ్‌ కంపెనీలు భారత్‌లో తయారీని పెంచేందుకు దోహదపడినట్టు కౌంటర్‌పాయింట్‌ తెలిపింది.

చదవండి:మొబైల్ యూజర్లకు గుడ్​ న్యూస్​.. టెలికాం సంస్థలకు షాక్​!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement