
ముంబై: స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాలతో మొదలైంది. ఆరంభంలో లాభాలు కనిపించినా వెనువెంటనే నష్టాల్లోకి జారుకుంది. గత మూడునాలుగు రోజులుగా నిత్యం మార్కెట్ నష్టాలతోనే ముగుస్తోంది. దీంతో అనేక స్టాక్స్ కనిష్టాల వద్ద లభిస్తుండటంతో బుధవారం ఉదయం కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే అది కొద్ది సేపటికే పరిమితం అయ్యింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ కమిటీ సమావేశాలు జరుగుతుండటం.. రేపోరేటు పెంచవచ్చనే నిర్ణయాలు మరోసారి ప్రభావం చూపాయి. దీంతో మరోసారి సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం రోజు ముగింపుతో పోల్చితే రెండు వందలకు పైగా పాయింట్ల లాభంతో 55,345 పాయింట్లతో మొదలైంది. కొద్ది సేపటి వరకు ఇదే జోరు కనిపించింది. కానీ అరగంట తర్వాత అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:14 గంటల సమయంలో 267 పాయింట్లు నష్టపోయి 54,840 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 16,362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.