కొత్తగా మూడు డేటా సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లను ఏర్పాటుచేస్తామని 2022 లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కొత్తగా మరో 3 డేటా సెంటర్ లను ప్రారంభిస్తామని తెలిపింది. గత సంవత్సరం ప్రారంభంలో వంద మెగావాట్ల సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రో సాప్ట్ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్ లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-పదిహేను సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్ లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయంది.
క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నామంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్ లు హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ నగరంతో మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్ లో హైదరాబాదే కీలకం అన్న అహ్మద్, భవిష్యత్తులోనూ ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్ లు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. డేటా సెంటర్లతో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని అహ్మద్ మజారీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment