ప్రముఖ ఐటీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మహారాష్ట్ర పుణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందుకోసం ఏకంగా రూ.520 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ ఎల్‌ఎల్‌పీ నుంచి ఈ కొనుగోలు చేసినట్లు పేర్కొంది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కార్యకాలాపాలు సాగిస్తోంది. దేశీయంగా డేటా సెంటర్లను విస్తరిస్తామని కంపెనీ గతంలో పలుమార్లు తెలిపింది. వివిధ నగరాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయనేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల పుణె నగరంలో పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో పుణెలో గడిచిన రెండేళ్లలో రూ.848 కోట్ల పెట్టుబడితో రెండు చోట్ల స్థలాలు తీసుకుంది.
ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల ద్వారా వివిధ కంపెనీలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ అందించనున్నారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు.. వంటి వాటికి డేటా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. ఇదిలాఉండగా, మైక్రోసాఫ్ట్ 2025 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం ‘అడ్వాంటేజ్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment