ఎత్తైన కొండలు, లోయ ప్రాంతాల్లోని ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాలను దించడం, టేకాఫ్ చేయడం సవాలుతో కూడుకున్న విషయం. ఈ సమస్యను అధిగమించేలా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లోయ చుట్టూ ఉన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితులకు ధీటుగా విమానాన్ని నడిపేందుకు వీలుగా ఆర్‌ఎన్‌పీ ఏఆర్ టెక్నాలజీని వినియోగించింది.
రిక్వైర్డ్ నేవిగేషన్ ఫర్‌ఫెర్మాన్స్ విత్ ఆథరైజేషన్ రిక్వయిర్డ్(ఆర్‌ఎన్‌పీ ఏఆర్)గా పిలువబడే ఈ టెక్నాలజీని విమానంలో వాడడం వల్ల ఎత్తు పల్లాలు వంటి ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా విమానాన్ని నడపవచ్చని ఇండిగో తెలిపింది. ఎత్తైన ప్రాంతంపై ఉన్న కాఠ్‌మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (కేటీఎం) లాంటి విమానాశ్రయాల కోసం ప్రత్యేకంగా ఈ సాంకేతికతను తయారు చేసినట్లు పేర్కొంది. ఇటీవల ఇండిగో ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ ఆర్‌ఎన్‌పీ ఏఆర్ సాంకేతికను ఉపయోగించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’
‘ఎత్తైన ప్రదేశంలోని ఉన్న కాఠ్‌మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (కేటీఎం) విమానాశ్రయం చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ను దించడం, టేకాఫ్ చేయడం సవాలుగా మారుతుంది. ఆర్‌ఎన్‌పీ ఏఆర్ విధానం ద్వారా విమాన మార్గాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగినట్లుగా పైలట్లు స్పందించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు తగ్గుతాయి. కొత్త సాంకేతికతతో ఎత్తు పల్లాల ప్రాంతాల్లో విమానాలను నడపడం సులువవుతుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగించాలంటే పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం’ అని ఇండిగో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment