న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూన్ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 41 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదురి వెల్లడించారు. 2021-22 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఈ విలువ రూ.2,50,881 కోట్ల నుంచి రూ.3,54,570 కోట్లకు చేరినట్లు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఇక ఇదే కాలంలో వస్తు సేవల పన్ను, కస్టమ్స్ సుంకాలుసహా పరోక్ష పన్ను వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ.3,14,476 కోట్ల నుంచి రూ.3,44,056 కోట్లకు ఎగసినట్లు ఆయన వెల్లడించారు.
కేంద్రంపై పెరిగిన వడ్డీ భారం
కేంద్రంపై వడ్డీ చెల్లింపుల భారం పెరిగినట్లు చౌదురి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2021–22లో (జీడీపీ విలువలో) ఈ పరిమాణం 3.1 శాతంగా ఉందని, విలువలో ఇది రూ.7.31 లక్షల కోట్లని ఆయన తెలిపారు. 2014-15లో వడ్డీ చెల్లింపుల విలువ 3.27 లక్షల కోట్లయితే, జీడీపీలో ఇది 2.6 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2014-15లో ప్రభుత్వంపై చెల్లింపుల భారం రూ.62.44 లక్షల కోట్లయితే (జీడీపీలో 50.1 శాతం), 2021-22లో ఈ విలువ రూ.138.88 లక్షల కోట్లని (జీడీపీలో 58.7 శాతం) వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ భారం 155.33 లక్షల కోట్లకు (60.2 శాతం) చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment