న్యూఢిల్లీ, సాక్షి: నేటి నుంచి ఏడాది పొడవునా.. 24 గంటలూ ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రూ. 2 లక్షలు.. అంతకుమించి పెద్ద మొత్తాలను ఆన్‌లైన్ ద్వారా సులంభంగా బదిలీ చేసేందుకు వీలు చిక్కింది. వాస్తవ సమయానుగుణంగా సర్వీసులు అందుబాటులోకి రావడంతో భారీ సొమ్మును సైతం త్వరగా బదిలీ చేసేందుకు అవకాశమున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా రోజంతా ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులోగల ప్రపంచంలోని కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లు తెలియజేశాయి. నగదు బదిలీ సేవలలోగల ఐదు ముఖ్యమైన పాయింట్లను చూద్దాం.. (జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్)
ఈజీగా..
ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి సొమ్ము రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్(ఆర్‌టీజీఎస్) ద్వారా బదిలీ కానుంది. ఇందుకు బ్యాంకులు అదనంగా ఎలాంటి చార్జీలనూ విధించబోవు. నేటి నుంచి ఏడాది పొడవునా.. 24 గంటలూ ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను ఆన్‌లైన్(ఇంటర్నెట్)తోపాటు.. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. బ్రాంచీని సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ ఈ సర్వీసులను పొందవచ్చు. కనీసం రూ. 2 లక్షల మొత్తాలను ఆర్‌టీజీఎస్ ద్వారా పంపించవచ్చు. ఈ విధానంలో గరిష్ట పరిమితిలేదని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి.
నెఫ్ట్ బాటలో
చిన్న మొత్తాలను పంపించుకునేందుకు అమలులో ఉన్న నెఫ్ట్ సేవలను ఆర్‌బీఐ ఏడాది క్రితమే రోజంతా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బాటలో తాజాగా ఆర్‌టీజీఎస్ సేవలనూ 24 గంటలకు ఆర్‌బీఐ పొడిగించింది. 4 ప్రధాన బ్యాంకుల ద్వారా 2004 మార్చి 26న ఆర్‌టీజీఎస్ సేవలు దేశీయంగా తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 237 బ్యాంకుల ద్వారా రోజుకి 6.35 లక్షల లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్‌బీఐ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ. 4.17 లక్షల కోట్లుకావడం విశేషం! సగటున ఆర్‌టీజీఎస్ ద్వారా రూ. 57.96 లక్షలు బదిలీ అవుతున్నట్లు నవంబర్ నెల డేటా తెలియజేసింది. దేశీయంగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రమోట్ చేసే బాటలో ఆర్‌బీఐ నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలపై అదనపు చార్జీలను విధించవద్దంటూ బ్యాంకులను ఆదేశించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment