నగరం రోడ్ల మీద ఎలక్ట్రిక్ టూ వీలర్ల సంచారం పుంజుకుంటోంది. పెరిగిన ఇంధన ధరలతో ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఇవి స్మార్ట్ వాహనాలు కూడా కావడం టెక్నాలజీ ప్రియులను ఆకర్షిస్తోది. –సాక్షి, సిటీబ్యూరో
గత ఏడాది కాలంలోఎలక్ట్రిక్ టూ వీలర్లకు స్వర్ణయుగంగా చెప్పాలి. ఒక్కసారిగా పెట్రోల్ అనుబంధ ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు లాక్‌డౌన్ వంటి సరికొత్త అనుభవాలు కూడా వీటి విక్రయాలకు ఊపునిచ్చాయి. గత 2020 ఫిబ్రవరి నాటికి అన్ని బ్రాండ్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు కలిపి 2243 విక్రయమైతే.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 6059 వాహనాలకు పెరగడం గమనార్హం. ఇది ఏకంగా 170.13శాతం పెరుగుదల.
పడుతూ లేస్తూ..పరుగులు తీస్తూ..: నిన్నా మొన్నటి దాకా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిశ్రమ స్తబ్ధుగా ఉంది. వినియోగదారుల్లో ఇ–వి వల్ల ఒనగూరే లాభాలు, అవసరంపై అవగాహన, విషయ పరిజ్ఞానం చాలా పరిమితంగా ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా పరిమితమైన ప్రోత్సాహమే ఉండేది. కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఎఎమ్‌ఇ 1 పాలసీ తర్వాత నిదానంగా, ఈ పరిశ్రమలో కదలిక మొదలైంది. గత 2016-17లో ఇవి 2 వీలర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిలో అత్యధికం చైనీస్ ఉత్పత్తులతో ఇండియాలో అసెంబుల్డ్ చేసినవి కావడంతో సరైన పెర్ఫార్మెన్స్ చూపలేకపోయాయి. ఆ అనుభవం నేపధ్యంలో ఫేమ్ 11 పాలసీ ప్రకటించాక పరిశ్రమ సరైన రీతిలో రూపుదిద్దుకుంటూ.. రెండేళ్లలో స్థిరమైన దశకు చేరి వాహనాల రూపకర్తలకు ఊపునిచ్చింది.
లాక్ లో లక్...: గత 2020 లాక్ డౌన్ వల్ల తయారీ రంగానికి సమస్యలు ఎదురైనా, చాలా వరకూ ఇ-వి పరిశ్రమకు మేలు చేసిన సంవత్సరంగానే చెప్పాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎన్నడూ లేనంత డిమాండ్ వచ్చింది. ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేవాళ్లు ముందుగా ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా పరిగణనలోకి తీసుకునేలా చేసిన సంవత్సరం ఇది. కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఎఎమ్‌ఇ–2 పాలసీ వల్ల అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల...ఈ స్కూటర్స్... పుంజుకున్నాయి. తొలి 2లక్షల వాహనాల వరకూ రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 100శాతం రోడ్ ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ‘‘కేంద్ర పాలసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు ఇంధనంలా పనిచేస్తున్నాయి’’అని నగరంలో ఇటీవలే ఎథేర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ ఏర్పాటు చేసిన సంస్థ ప్రతినిధులు చెప్పారు.
గత 2018 ఏప్రిల్‌కూ, 2021 జనవరికి మధ్య ఇంధన ఆధారిత ద్విచక్రవాహనాల ధరల్లో 25శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే లిథియమ్–ఐయాన్ బ్యాటరీ ధర దాదాపుగా 24శాతం తగ్గింది. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు, ఇంధన ఆధారిత వాహనాల విక్రయాలకు, ఇ వాహనాల విక్రయాలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తున్నాయి. సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే సగటున కి.మీకి 10 నుంచి 20శాతం వరకూ తక్కువ నిర్వహణ ఖర్చులు... విద్యుఛ్చక్తి అందుబాటులో ఉండడం తదితర కారణాల వల్ల అర్బన్ మార్కెట్స్ వీటికి బాగా దగ్గరవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
టెక్...ట్రిక్...: సమీప భవిష్యత్తులో థెఫ్ట్ డిటెక్షన్, లొకేషన్ రిమైండర్స్ తదితర అవసరాలకు తగ్గట్టుగా తయారైన వాహనాలను వినియోగదారులు కోరుకోవడం పెరగనుంది. ఈ అంచనాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు స్మార్ట్ టెక్నాలజీని అనుసంధానించారు. ఓటీఎ అప్‌డేట్స్, వాహన విడిభాగాలు పాడయ్యే స్థితిలో ఉంటే ముందే కనిపెట్టడం, రిమోట్ సర్వీసింగ్ (వాహనాన్ని కనీసం కదపవలసిన అవసరం లేకుండానే వాహనాన్ని మరమ్మతు చేయడం), రైడింగ్‌స్టైల్స్, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ వంటి ఫీచర్లన్నీ ఈ స్మార్ట్ వాహనాలు అందిస్తున్నాయి.
ఊరించే ఉపయోగాలు...
రూ.1.50లక్షలు మొదలుకుని రూ.2లక్షల వరకూ ధర పలికే ఈ వాహనాలు..ఖరీదులో కొంత ఎక్కువే అయినప్పటికీ సాధారణ ఇంధన ఆధారిత వాహనాలతో పోలిస్తే దీని నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. అలాగే వాతావరణ కాలుష్యాన్ని పెంచేవి కావు, పెట్రోల్ లేదా మరే ఇంధనంపైన అయినా ఆధారపడడాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువుల్ని తగ్గించడంతో పాటు వాయు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.
స్పందన బాగుంది : మా ఎథేర్ 450ఎక్స్‌కు సిటీలో మంచి డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం వల్ల జంట నగరాల్లో విస్తరణ సులభం అవుతోంది. ఇక్కడ టెక్నాలజీ పట్ల నగరవాసులల్లో బాగా ఆసక్తి ఎక్కువ. తమ వాహనాలను, గాడ్జెట్స్‌ను కొత్త కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసుకోవడం వారి అలవాటు. బెంగుళూర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, తిరుచ్చి, మైసూర్, హుబ్లి, కోయంబత్తూర్... లలో నెలకొల్పాం. సర్వీసింగ్‌కు సంబంధించి గుమ్మం ముంగిటకు వచ్చి తీసుకు వెళ్లడం... ఫోన్ కాల్ లేదా యాప్ ద్వారా సర్వీస్ అపాయింట్మెంట్ అందిస్తాం. ప్రతి 5వేల కి.మీ ఒకసారి తనిఖీ చేస్తాం. ప్రతి 10వేల కి.మీ ఒకసారి తప్పనిసరిగా సర్వీస్ సెంటర్ ద్వారా సర్వీస్ చేస్తాం. మా అథేర్ ఫోరమ్‌లో దాదాపు 12వేలకు పైగా సభ్యులున్నారు -ఎథేర్ ఎనర్జీ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment