2027 నాటికి అవతరణ
ఆ తర్వాత గౌతమ్ అదానీ వంతు
2033లో ఈ స్థానానికి ముకేశ్ అంబానీ
ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ అంచనా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు)గా 2027 నాటికి రికార్డ్ సృష్టించనున్నారు. మరుసటి ఏడాది (2028లో) అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సైతం ట్రిలియనీర్ అవుతారని ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక అంచనా వేసింది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2033లో ఈ స్థానానికి చేరుకుంటారని పేర్కొంది. ఎలాన్ మస్క్ 237 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు.
2027 నాటికి ట్రిలియనీర్ స్థానానికి చేరుకోవాలంటే మస్క్ నికర సంపద ఏటా 110 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. అదానీ 100 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం మాదిరే అదానీ సంపద ఏటా 123 శాతం చొప్పున పెరుగుతూ పోతే, ఎలాన్ మస్క్ తర్వాత 2028లో ప్రపంచ రెండో ట్రిలియనీర్ అవుతారని ఈ నివేదిక అంచనా వేసింది. 111 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీ 2033 నాటికి ట్రిలియనీర్ అవుతారని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2035లో లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేసింది.
2025లో టీఎస్‌ఎంసీ: తైవాన్‌కు చెందిన సెమీ కండక్టర్ తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ మార్కెట్ విలువ 893.7 బిలియన్ డాలర్లుగా ఉంటే, వచ్చే ఏడాది ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఎలాన్ మస్‌్క, గౌతమ్ అదానీ, ఎన్‌వీడియా వ్యవస్థాపకుడు జెన్సెస్ హాంగ్, ఇండోనేసియాకు చెందిన ప్రజోగో పాంగెట్సు, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఫేస్‌బేక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్రిలియనీర్లుగా అవతరించే అవకాశాలున్నట్టు వివరించింది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్, ఎన్‌వీడియా, యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ ఆరామ్‌కో, మెటా, బెర్క్‌షైర్ హాత్‌వే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment