న్యూఢిల్లీ: స్పేస్‌ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారని ఇండియా స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్‌తో వీటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ప్రీ–ఆర్డర్ల సంఖ్య 5,000 స్థాయిని దాటేసిందని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంపై తమ సంస్థ ఆసక్తిగా ఉందని భార్గవ వివరించారు. బీటా దశలో 50 నుంచి 150 మెగాబిట్ పర్ సెకన్ స్థాయిలో డేటా స్పీడ్ అందిస్తామని స్టార్‌లింక్ చెబుతోంది. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది.
అంతర్జాతీయంగా స్టార్‌లింక్ కనెక్షన్లకు ప్రీ–ఆర్డర్లు 5,00,000 స్థాయిని దాటేసిందని భార్గవ చెప్పారు. దేశీయంగా రాబోయే నెలల్లో ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీకండక్టర్‌ల కొరత కారణంగా స్టార్‌లింక్ కిట్లను తయారు చేసే వేగం మందగించిందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment