అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సదుద్దేశంతో త్వరలో మరిన్ని స్కూల్స్, కాలేజీలు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ‘ది ఫౌండేషన్’ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థకు 100 మిలియన్ల విరాళం ఇచ్చినట్లు తెలిపారు.
ఎలాన్ మస్క్ ప్రాథమిక విద్య నుంచి హైస్కూల్స్ వరకు వినూత్న పద్దతుల్లో విద్యను అందించేలా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెట్లపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు.
50 మంది విద్యార్ధులతో ప్రారంభించి
ఎలాన్ మస్క్ ట్యాక్స్ ఫైలింగ్ ఆధారంగా బ్లూమ్‌బెర్గ్ నివేదికను విడుదల చేసింది. అస్టిన్, టెక్సాస్‌లలో నిర్మించనున్న పాఠశాలలను దాదాపు 50 మంది విద్యార్థులతో ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. ఒక వేళ విద్యార్ధులకు ప్రత్యేకంగా ట్యూషన్‌లు పెట్టాలనుకుంటే అందుకు వారికి అయ్యే ఖర్చును స్వయంగా భరించనున్నట్లు తెలుస్తోంది.
గుర్తింపు కోసం
ది ఫౌండేషన్ ద్వారా స్కూల్స్, కాలేజీల్లో చదివే విద్యార్ధులకు అత్యున్నత స్థాయిలో విద్యను అందించి.. యూనివర్సిటీ స్థాయిలో తీర్చిదిద్దేలా దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మస్క్ ట్యాక్స్ ఫైలింగ్‌లో తెలిపారు. ఇక తాను ఏర్పాటు చేయనున్న స్కూల్స్, కాలేజీలకు గుర్తింపు కోసం అమెరికా ప్రభుత్వ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన సదరన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ స్కూల్స్ కమీషన్ (Sacscoc) తో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.
క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడా?
ఎలాన్ మస్క్ విజినరీ ఆంత్రప్రెన్యూర్. స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓగా ఉన్న ఆయన 2014లో ఆస్ట్రా నోవా స్కూల్ పేరుతో తన సంస్థల్లో పనిచేసే పిల్లలకు విద్యను అందిస్తున్నారు. సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెప్పి యూనిక్‌గా చదువు చెప్పిస్తున్నారు. ఈ తరుణంలో మస్క్ గత కొంతకాలంగా విద్యా వ్యవస్థపై అసంతృప్తని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్ధుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయంటూ ఎక్స్.కామ్‌లో వరుస ట్వీట్‌లు చేశారు. తాజాగా, ఆయనే మరిన్ని స్కూల్స్,కాలేజీలు నిర్మించేందుకు నడుం బిగించారు.
సింథసిస్ స్కూల్ సైతం
ఎలాన్ మస్క్, జోష్ డాన్‌లు కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్‌ను స్థాపించారు. ప్రస్తుతమున్న స్కూళ్లన్నింటి కంటే విభిన్నంగా కరిక్యులమ్, యాక్టివిటీస్ సింథసిస్‌లో ఉంటాయి. ఈ స్కూల్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్‌ను విద్యార్థులకు నేర్పిస్తారు.
గతంలో స్పేస్ఎక్స్ కంపెనీలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్‌తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు. మూడేళ్ల క్రితం ఈ స్కూల్‌లో వరంగల్‌కు చెందిన అనిక్‌పాల్ సీటు సంపాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment