మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి.
యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్‌బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు.
కారణం..
డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్‌ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది.
2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్‌లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్‌బీ టైప్ సీ, యూఎస్‌బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్‌లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు.
యాపిల్‌కు ఎదురుదెబ్బ
ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్‌లను, ఛార్జర్‌లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్‌తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్‌పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్‌ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్‌కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం.
యాపిల్‌లో సీ ఉందిగా!
ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్‌బుక్‌లు మాత్రం యూఎస్‌బీ-సీ స్టాండర్డ్ మోడర్న్‌తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్‌కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్‌బీ-సీ, యూఎస్‌బీ-ఏ ఉపయోగిస్తున్నారు.
వేటి వేటి కంటే..
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్‌ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్‌నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు.
డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్‌లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్‌ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్.
- సాక్షి, వెబ్‌స్ఫెషల్
Comments
Please login to add a commentAdd a comment