ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ, ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ అత్యవసర సమావేశపు నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ప్రభావం చూపొచ్చంటున్నారు. హిందూ నూతన సంవత్సరం ‘2079 సంవత్’ తొలివారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు లాభపడ్డాయి.
‘‘జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. కన్సాలిడేషన్‌లో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,400 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు.
ఫెడ్ రిజర్వ్ సమావేశం
అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ ఒకటిన) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.
ఆర్‌బీఐ ఎంపీసీ అత్యవసర భేటీ
రిజర్వ్ బ్యాంక్ తన తదుపరి పరపతి ద్రవ్య సమీక్ష(ఎంపీసీ) సమావేశాన్ని గురువారం (నవంబర్ 3న) అత్యవసరంగా నిర్వహించనుంది. వరుసగా మూ డు త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలంకావడంతో ఆర్‌బీఐ మరోదఫా వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు
ఈ వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, యూపీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్‌పీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, గెయిల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.
స్థూల ఆర్థిక గణాంకాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న) వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యలోటు, మౌలిక రంగ గణాంకాలు సోమవారం విడుదల కానున్నాయి. మరసటి రోజు అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. సేవారంగ డేటా గురువారం వెల్లడి కానుంది. అలాగే శుక్రవారం ఆర్‌బీఐ అక్టోబర్ 21 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 28వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.
తగ్గిన ఎఫ్‌ఐఐల అమ్మకాల ఉధృతి
దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఉధృతి తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించిన ఎఫ్‌ఐఐలు ఈ నెలలో ఇప్పటి వరకు(29 తేదీ నాటికి) రూ.1,586 కోట్ల షేర్లను మాత్రమే అమ్మారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో నికరంగా 1.70 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగడం, బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత తదితర అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చు’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా అసిసోయేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
ఫెడ్ రిజర్వ్, ఆర్‌బీఐ నిర్ణయాలు కీలకం
Published Mon, Oct 31 2022 6:27 AM | Last Updated on Mon, Oct 31 2022 6:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment