న్యూఢిల్లీ: ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 2.3–2.5 లక్షల కోట్లకు పెరుగుతుందని పరిశ్రమల సంఘం– ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఏఐ) అంచనావేసింది.
అయితే 2023–24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ బిల్లు 25 శాతం తగ్గవచ్చని పరిశ్రమల సంఘం ఎఫ్‌ఏఐ తెలిపింది. గ్లోబల్ ధరల్లో తగ్గుదల దీనికి కారణం అవుతుందని పేర్కొంది. యూరియా స్థిర ధరను పెంచకపోవడంతో ఈ కర్మాగారాల మనుగడపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పరిశ్రమ చాలా తక్కువ మార్జిన్‌లో నడుస్తోందని, ఇది ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తోందని కూడా సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న రబీ (శీతాకాలం–సాగు) సీజన్‌కు యూరియా, డీఏపీసహా తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని కూడా పరిశ్రమల సంఘం తెలిపింది. ఎఫ్‌ఏఐ ప్రెసిడెంట్ కేఎస్ రాజు పరిశ్రమకు సంబంధించి విలేకరులకు తెలిపిన ముఖ్యాంశాల్లో కొన్ని..
► ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 2.3–2.5 లక్షల కోట్ల స్థాయికి పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయంగా ఎరువులు, ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం వల్ల అన్ని ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం నుంచి దేశీయ రైతులను రక్షించేందుకు ఈ స్థాయి సబ్సిడీలు దోహదపడుతున్నాయి. 2021–22లో సబ్బిడీ భారం రూ.1.62 లక్షల కోట్లు.
► గత రెండేళ్లలో సహజవాయువు, ఎల్‌ఎన్‌జీతో సహా ఎరువులు– ఎరువుల ముడి పదార్థాలకు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయి.
► కొన్ని ధరలు ఇటీవలి నెలల్లో తగ్గుముఖం పట్టాయి. అయితే మహమ్మారికి ముందు కాలం కంటే ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి. డీఏపీ అంతర్జాతీయ ధర (సీఎఫ్‌ఆర్– వ్యయం భారత్‌కు సరకు రవాణా) ఏప్రిల్ 2021న టన్నుకు 555 డాలర్లు ఉంది. అయితే ఈ ధర జూలై 2022నాటికి 945 డాలర్లకు పెరిగింది. ఇది 2022 అక్టోబర్‌కు మళ్లీ 722 డాలర్లకు తగ్గింది.
► అలాగే ఫాస్పోరిక్ యాసిడ్ ధర ఏప్రిల్ 2021లో టన్నుకు 876 డాలర్లు ఉంది. 2022 జూలై నాటికి టన్నుకు 1718 డాలర్లకు పెరిగింది. అయితే ఇది 2022 అక్టోబర్‌కు 1355 డాలర్ల స్థాయికి తగ్గింది.
► యూరియా విషయానికి వస్తే, 2021 ఏప్రిల్‌లో టన్నుకు 400 డాలర్లు ఉంది. 2021 డిసెంబర్ నాటికి 1000 డాలర్లకు చేరింది. తాజాగా టన్నుకు 600 డాలర్లకు తగ్గింది.
► యూరియా స్థిర ధర, ఇంధన వినియోగ నిబంధనలు వంటి అంశాల్లో యూరియా పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతికూలతలను పరిష్కరించాలి.
► 2022 ఏప్రిల్–అక్టోబర్ 2022లో యూరియా, డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్) ఎస్‌ఎస్‌పీ వార్షికంగా వరుసగా 16.0 శాతం, 14.2 శాతం, 9.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎన్‌పీ, ఎన్‌పీకే కాంప్లెక్స్ ఎరువుల ఉత్పత్తి ఈ కాలంలో 5.2 శాతం క్షీణతను నమోదు చేసింది.
► 2022 ఏప్రిల్–అక్టోబర్లో డీఏపీ ఎన్‌పీ, ఎన్‌పీకే కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు వరుసగా 45.2 శాతం, 76.1 శాతం పెరిగాయి. అయితే, యూరియా, ఎంఓపీ దిగుమతులు వరుసగా 12.9 శాతం, 7.3 శాతం తగ్గాయి.
► భారతీయ ఎరువుల రంగం పేలవమైన లాభదాయకతతో పనిచేస్తోంది. 24 ఎరువుల కంపెనీలకు సంబంధించి అందించిన డేటా ప్రకారం... గత ఐదేళ్లలో (2017–18, 2018–19, 2019–20, 2020–21, 2021–22) పరిశ్రమ నికర లాభం వరుసగా 0.61 శాతం, 0.39 శాతం, 0.64 శాతం, 2.47 శాతం, 1.39 శాతాలుగా ఉన్నాయి.
► ఇటువంటి అతి తక్కువ మార్జిన్‌లు ఇప్పటికే చేసిన పెట్టుబడులకే సవాళ్లుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ రంగంలో తాజా పెట్టుబడులను, ప్రత్యేకించి, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment