ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డుల పండుగ కొనసాగుతూనే ఉంది. కరోనా నివారణ వ్యాక్సిన్ తయారీ ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆశలను రేకెత్తించాయి. రూపాయి 16 పైసలు బలపడి మార్కెట్ జోరుకు మరింత ప్రోత్సాహం అందించింది. అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ అండగా నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులను సృష్టించాయి. చివరికి సెన్సెక్స్ 315 పాయింట్లు పెరిగి 43,952 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లను ఆర్జించి 12,874 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. మరోవైపు ఫార్మా, మీడియా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇంట్రాడేలో 44,000 స్థాయిని తాకిన సెన్సెక్స్
కోవిడ్–19 మహమ్మారి నిర్మూలనకు ఇప్పటికే ఫైజర్ వ్యా క్సిన్ ఆశలు రేపగా... తాజాగా మోడర్నా సైతం తాము రూపొందించిన వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలో 94.50 శాతం విజయవంతమైనట్లు పేర్కొంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అర్థిక అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్లు ఆల్‌టైమ్ హైని తాకాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మన సూచీలు ఉత్సాహంగానే మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విస్తృతమైన కొనుగోళ్లు ఉదయం సెషన్‌లోనే సెన్సెక్స్ 523 పాయింట్లు లాభపడి 44,000 పాయింట్ల మైలురాయిని సైతం దాటి 44,161 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ సైతం 154 పాయింట్లు పెరిగి 13,000 పాయింట్ల స్థాయి సమీపానికి అంటే 12,934 వద్ద ఆల్‌టైంహైని అందుకుంది. సూచీలు జీవితకాల గరిష్టాలను తాకిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అయితే మెటల్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగాల షేర్ల అండతో సూచీలు మూడోరోజూ రికార్డు స్థాయిల వద్దే ముగిశాయి. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు మెరుగైన ఫలితాలను సాధించడంతో టాటా స్టీల్ కంపెనీ షేరు ఆరుశాతం లాభపడి రూ.523 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.530 స్థాయి వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది.
రెండో త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో ఇండియాబుల్స్ రియల్స్ ఎస్టేట్ షేరు 5శాతం నష్టంతో రూ. 60 వద్ద ముగిసింది. ఈ క్యూ2 క్వార్టర్‌లో కంపెనీ రూ.76.01 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
బైబ్యాక్ ప్రణాళికకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపినట్లు విప్రో కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. సుమారు 23.75 కోట్ల షేర్లను ఒక్కోటీ రూ.400 చొప్పున బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ.9,500 కోట్లను వెచ్చినుంది. ఇప్పటికే బోర్డు డైరెక్టర్ల అనుమతిని తీసుకుంది.
రూపాయికి ‘వ్యాక్సిన్’ ఇమ్యూనిటీ
కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తోందన్న వార్తలు రూపాయిని బలోపేతం చేస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో మంగళవారం వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్‌లోనూ రూపాయి విలువ 16 పైసలు లాభపడి, 74.46 వద్ద ముగిసింది. ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ట్రేడయ్యే– డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణి కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు. భారత్‌లో స్టాక్ మార్కెట్ ర్యాలీ కూడా రూపాయికి సానుకూల అంశంగా ఉంటోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment