ముంబై: వ్యాక్సిన్‌పై ఆశలు, అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం స్టాక్ మార్కెట్‌ను నడిపిస్తాయని నిపుణులంటున్నారు. అలాగే నవంబర్ 26న డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు, పుంజుకుంటున్న కరోనా కేసులు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు తదితర అంశాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, కరోనా వైరస్ నిర్మూలనకు ఆయా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలను ఇవ్వడం, బ్యాంకింగ్ రంగం ప్రీ–కోవిడ్ స్థాయికి చేరుకోవడం లాంటి సానుకూలాంశాలతో గతవారంలో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లను ఆర్జించాయి. సెన్సెక్స్ 44,230 వద్ద, నిఫ్టీ 12,963 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కీలకాంశంగా ఎఫ్‌ఐఐల పెట్టుబడులు...
దేశీయ ఈక్విటీల కొనుగోళ్లకు విదేశీ పోర్ట్‌ఫోలియో (ఎఫ్‌ఐఐ)లు అధిక ఆసక్తిని చూపుతున్నారు. ఈ నవంబర్‌లో వారు నికరంగా రూ. 42,378 విలువైన పెట్టుబడులు పెట్టారు. గడిచిన 20 ఏళ్లలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. ఫెడ్ రిజర్వ్, ఈయూ కేంద్ర బ్యాంకుతో పాటు అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లపై ఉదాసీనత, ఉద్దీపన ప్యాకేజీ విడుదలతో పెరిగిన లిక్విడిటీ దేశీయంగా విదేశీ పెట్టుబడులకు తోడ్పడినట్లు విశ్లేషకులు తెలిపారు. ఏవైనా ఇతరేతర కారణాలతో ఎఫ్‌ఐఐలు పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకుంటే దేశీయ ఈక్విటీ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. క్రిస్‌మస్ పండుగకు ముందు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లను తగ్గించిన వెంటనే మార్కెట్లో దిద్దుబాటును చూడవచ్చని నిపుణులంటున్నారు.
వ్యాక్సిన్‌పై ఫలితాల ప్రభావం...
కోవిడ్–19 కట్టడికి తయారవుతున్న వ్యాక్సిన్ల అభివృద్ధి, పరీక్షల్లో ఫలితాలు వచ్చే రోజుల్లో సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయి. అమెరికా ఫార్మా కంపెనీలై మోడర్నా, ఫైజర్‌లు రూపొందించిన వ్యాక్సిన్లు మూడో దశలో 95 శాతం ఫలితాలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల విజయవంతంపై మార్కెట్ వర్గాలు భారీ ఆశల్నే పెట్టుకున్నాయి.
ఫెడ్ రిజర్వ్ మినిట్స్...
ఈ వారంలో దేశీయ ఆర్థిక గణాంకాల విడుదల లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ గమనానికి ప్రధానాంశంగా మారనున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ఇదే వారంలో ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మినిట్స్, నిరుద్యోగ గణాంకాల నమోదు, పలు కంపెనీల ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటి ప్రభావం ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించగలవు. అలాగే అంతర్జాతీయంగా రెండో దశ కరోనా కేసుల పెరుగుదల ఈక్విటీ మార్కెట్లను కలవరపెడుతున్నాయి.
రూపాయి కీలకమే...
రూపాయి కదలికలు కీలకం కానున్నాయి. స్థిరమైన సూచీల ర్యాలీ, క్రమమైన విదేశీ పెట్టుబడుల రాకతో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 74.16 వద్ద ముగిసింది. ఇది వారం గరిష్టస్థాయి కావడం విశేషం.
నవంబర్ 26న ఎఫ్‌అండ్‌ఓ ముగింపు...
గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు డిసెంబర్ సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో మార్కెట్ ఆటుపోట్లకు లోనయ్యే వీలుందని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
27న జీడీపీ క్యూ2 గణాంకాలు...
ఈ నెల 27వ తేదీ శుక్రవారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సెప్టెంబర్ త్రైమాసిక (క్యూ2) గణాంకాలు వెలువడనున్నాయి. అయితే ఇవి మార్కెట్ అనంతరం వెలువడే అవకాశం ఉన్నందున, అంచనాలకు అనుగుణంగా మార్కెట్ కదలాడే అవకాశం ఉంది. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నమోదయిన నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతానికి క్షీణత పరిమితమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
వ్యాక్సిన్‌పై ఆశలే నడిపిస్తాయ్!
Published Mon, Nov 23 2020 6:29 AM | Last Updated on Mon, Nov 23 2020 6:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment