సెన్సెక్స్ 2,303 పాయింట్ల ర్యాలీ
మళ్లీ 74,000 మైలురాయిపైకి.. అన్ని రంగాలు లాభాల దూకుడు
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఖరారు కావడంతో నేలక్కొట్టిన బంతిలా దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రా డేలో 2,456 పాయింట్ల ‘పోల్’వాల్ట్ చేసింది. నిఫ్టీ సైతం 786 పాయింట్లు జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ తిరిగి 74,530 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 22,670ను దాటేసింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 13 లక్షల కోట్లకుపైగా బలపడింది!
ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున గత నాలుగేళ్లలోనే అత్యధిక స్థాయి పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టే వీలుండటంతో సెంటిమెంటు బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. సెన్సెక్స్ 2,303 పాయింట్లు జంప్‌చేసి 74,382 వద్ద నిలిచింది. నిఫ్టీ 736 పాయింట్లు పురోగమించి 22,620 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు రూ. 13.22 లక్షల కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 408 లక్షల కోట్ల(4.89 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది!
ఎఫ్‌పీఐ అమ్మకాలు
బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 4.4%, 3% చొప్పున ఎగశా యి. కాగా.. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తాజాగా రూ. 5,656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 4,555 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 12,436 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 3,319 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. దీంతో బీఎస్‌ఈ మా ర్కెట్ విలువలో రూ. 31 లక్షల కోట్లకుపైగా తగ్గింది.
బ్లూ చిప్స్ దన్ను...
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 6–2 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల జోరును అర్ధం చేసుకోవచ్చు! ప్రధానంగా మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ 4 శాతంపైగా బలపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి.
అదానీ షేర్లు అప్
మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌తో ఒక్క అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మినహా (–2.6%) అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అత్యధికం మళ్లీ లాభపడ్డాయి. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 15.57 లక్షల కోట్లను అధిగమించింది.
మేలో ‘సేవలు’ పేలవం
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మేనెల్లో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ నెల్లో 60.8 వద్ద ఉన్న హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మే లో 60.2కు తగ్గింది. కాగా, కొత్త ఎగుమతుల ఆర్డర్లు 10 సంవత్సరాల గరిష్టానికి చేరడం హర్షణీయ పరిణామం.
Comments
Please login to add a commentAdd a comment