ముంబై: కరోనా రెండో దశ విజృంభణతో సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు కలవరపెట్టగా.., లాక్‌డౌన్ భయాలు వెంటాడాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. రూపాయి వరుస పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం కూడా ప్రతికూలాంశంగా మారింది. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి ట్రేడింగ్ చేశారు.
కార్పొరేట్ సంస్థల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా సూచీలు ఫిబ్రవరి 26 తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,708 పాయింట్లను కోల్పోయి 47,883 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 524 పాయింట్ల పతనంతో 14,311 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు చెందిన షేర్లు పెద్ద ఎత్తున విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ట్రేడింగ్ మొదలు ముగిసేంతవరకు ట్రేడర్లు అమ్మేందుకే ఆసక్తి చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 587 పాయింట్లను కోల్పోయింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఒక్క డాక్టర్ రెడ్డీస్ తప్ప, మిగిలిన అన్ని షేర్లు నష్టాల నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్‌లోని 50 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,746 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.233 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలే...
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 634 పాయింట్ల క్షీణతతో 48,957 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు పతనంతో 14,645 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేవలం పావు గంట వ్యవధిలోనే సుమారు 190 షేర్లు లోయర్ సర్క్యూట్ తాకాయి. అలాగే బీఎస్‌ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది.
భారీ నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో సూచీలు కాస్తయినా కోలుకుంటాయని ఆశించిన ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ మరింత క్షీణించసాగాయి. ఏ ఒక్క రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్ల నష్టపోయి 47,693 వద్ద, నిఫ్టీ 587 పాయింట్లు పతనమై 14,248 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేశాయి. మిడ్‌సెషన్ సమయంలో యూరప్ మార్కెట్ల నష్టాలతో మొదలు కావడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి.
‘‘కరోనా ఉధృతి, లాక్‌డౌన్ భయాలతో స్టాక్ మార్కెట్ నెలరోజు కనిష్టానికి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గి, ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టేంత వరకు మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్–ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
నిమిషానికి రూ.2,321 కోట్ల నష్టం
సూచీల మూడున్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.8.77 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.2321 కోట్ల నష్టాన్ని చవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచి్చంది.
నష్టాలకు నాలుగు కారణాలు...
కరోనా కేసుల ఉధృతి, లాక్‌డౌన్ భయాలు...
కరోనా కేసుల ఉధృతి, లాక్‌డౌన్ భయాలు స్టాక్ మార్కెట్‌ను కుదిపేశాయి. దేశవాప్తంగా ఆదివారం ఒక్కరోజే 1.68 లక్షల కేసుల నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులు రోజు కో నూతన గరిష్టాన్ని నమోదు చేస్తున్న తరుణంలో లాక్‌డౌన్ భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.
వ్యాక్సిన్ కొరత...
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. వ్యాక్సిన్లు లేక రాష్ట్ర ప్రభుత్వాలు టీకా కేంద్రాలను మూసేశాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు రోజుల టీకా ఉత్సవ్ మందకొడిగా సాగడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
గణాంకాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత
టెక్ దిగ్గజం టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో దేశీయ కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడి మొదలవుతుంది. కంపెనీల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పలు కంపెనీల షేర్లలో ముందస్తు లాభాల స్వీకరణ చేశారని స్టాక్ నిపుణులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గారు.
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు...
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై సానుకూల వైఖరికే మొగ్గుచూపవచ్చనే అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ మళ్లీ పుంజుకున్నాయి.అలాగే అమెరికాలోనూ ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ఇన్వెస్టర్లు కూడా అప్రమత్త వైఖరి అనుసరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment