గత ఆర్థిక సంవత్సరం (2019–20) చివరి రోజైన మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ మాంచి లాభాలతో ముగిసింది. కానీ పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. సోమవారం భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం ఒకింత ఊపిరి పీల్చుకున్నాయి. సోమవారం అమెరికా స్టాక్‌సూచీలు 3–4 శాతం లాభాల్లో ముగియడం, మార్చి నెలలో చైనా తయారీ రంగం అంచనాలను మించి పుంజుకోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకోవడం... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 1,028 పాయింట్లు పెరిగి 29,468 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 317 పాయింట్ల లాభంతో 8,598 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 3.8 శాతం చొప్పున లాభపడ్డాయి.
కరోనా కల్లోలమున్నా... రోజంతా లాభాలే...
కరోనా కల్లోలం కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్ రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. లాభాల్లోనే ఆరంభమై, రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,331 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్ల మేర లాభపడ్డాయి. కాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,200కు, మరణాల సంఖ్య 32కు చేరగా, రికవరీ అయిన వారి సంఖ్య వందకు పెరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు, మరణాలు 39,000కు చేరాయి. సోమవారం భారీగా క్షీణించిన ముడిచమురు ధరలు కోలుకున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.6% ఎగసి 27.37 డాలర్లకు పెరిగింది.
ప్రపంచ మార్కెట్ల పరుగులు...
సోమవారం అమెరికా స్టాక్‌సూచీలు 2–3 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. ఈ జోష్‌తో ఆసియా మార్కెట్లు 2–3 శాతం రేంజ్‌లో పెరగ్గా, యూరప్ మార్కెట్లు కూడా లాభాలతోనే మొదలయ్యాయి. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో 35.7 ఉన్న చైనా తయారీ రంగ పీఎమ్‌ఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఈ ఏడాది మార్చిలో 52కు పెరగడం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.
మరిన్ని విశేషాలు..
► ఐటీసీ 8 శాతం లాభంతో రూ.172 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ నష్టపోగా, మిగిలిన 26 షేర్లు లాభపడ్డాయి.
► గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్లర్లో డిపాజిట్లు 10–11 శాతం తగ్గాయన్న వార్తల కారణంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 15 శాతం నష్టంతో రూ.351 వద్ద ముగిసింది.
► మార్చిలో చైనా తయారీ రంగం పుంజుకోవడంతో లోహ షేర్లు జోరుగా పెరిగాయి. సెయిల్, టాటా స్టీల్, వేదాంత, హిందుస్తాన్ కాపర్, హిందాల్కో నాల్కో షేర్లు 13 శాతం వరకూ పెరిగాయి.
మార్చిలో మరింతగా పతనం...
కరోనా వైరస్ కల్లోలంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గత ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయింది. సెన్సెక్స్9,204 పాయింట్లు(23.8%), నిఫ్టీ 3,026 పాయింట్లు (26%) పతనమయ్యాయి. ఒక్క మార్చిలోనే సెన్సెక్స్ 8,829 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో అత్యధిక పాయింట్లు నష్టపోయింది ఈ ఏడాది మార్చిలోనే. స్టాక్ సూచీలు చరిత్రాత్మక గరిష్ట స్థాయిలను దాటింది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్ మార్కెట్ అత్యధికంగా నష్టపోయింది కూడా గత ఆర్థిక సంవత్సరంలోనే. ఇన్వెస్టర్ల సంపద రూ.37.59 లక్షల కోట్లు ఆవిరైంది.
రూ. 4 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.113.50 లక్షల కోట్లకు ఎగసింది.
ట్రేడింగ్ గంటలు తగ్గించండి.. సెబీని కోరిన ఏఎన్‌ఎమ్‌ఐ
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈక్విటీ, డెరివేటివ్స్ సెగ్మెంట్లకు సంబంధించి ట్రేడింగ్ వేళలను కుదించాలని సెబీని ఏఎన్‌ఎమ్‌ఐ(అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజేస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా) కోరింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఉదయం 9.15కు మొదలై సాయంత్రం 3.30కు ముగుస్తోంది. ఈ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పరిమితం చేయాలని ఏఎన్‌ఎమ్‌ఐ విజ్ఞప్తి చేసింది. కమోడిటీ మార్కెట్ ట్రేడింగ్‌ను సాయంత్రం 5కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే.
మౌలిక రంగం 5.5 శాతం వృద్ధి
ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం ఫిబ్రవరిలో 5.5 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య ఈ విభాగం వృద్ధి రేటు కేవలం 1 శాతం.
కట్టుతప్పిన ద్రవ్యలోటు: ప్రభుత్వ ఆదాయం–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం(ద్రవ్యలోటు) ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యానికి మించి ఫిబ్రవరినాటికే రూ.10,36,485 కోట్లకు చేరింది. అంటే లక్ష్యంలో 135.2%కి పెరిగిందన్నమాట. 2019–20 లో రూ.7.66 లక్షల కోట్లుగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది 2019–20 జీడీపీ అంచనాల్లో దాదాపు 3.8 శాతం.
Comments
Please login to add a commentAdd a comment