న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో .. నిలకడైన వృద్ధి, సుస్థిరతను సాధించేందుకు స్థూల ఆర్థిక పరిస్థితులపై నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ నెలవారీ ఎకనామిక్ రివ్యూలో పేర్కొంది. రాబోయే శీతాకాలంలో ఇంధన భద్రతపై సంపన్న దేశాలు మరింతగా దృష్టి పెడుతుండటంతో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకూ ఇంధన అవసరాల నిర్వహణలో సమయోచితంగా వ్యవహరిస్తున్న భారత్ సామర్థ్యాలకు ఇది పరీక్షగా మారవచ్చని పేర్కొంది.
ఇంధన అవసరాలకు సంబంధించి భారత్ 85 శాతం పైగా ముడిచమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటున్నందున రేటు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం మరింతగా ఎగిసే ముప్పు ఉంది. వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం ఎగియడం వంటి సమస్యలతో చాలా మటుకు దేశాలు సతమతమవుతుండగా .. భారత్‌లో మాత్రం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, వృద్ధి కూడా భారీ స్థాయిలోనే నమోదు చేయగలుగుతోందని రివ్యూ వివరించింది.
భారత్ తన వృద్ధి లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే వివేకవంతమైన ద్రవ్య విధానం, విశ్వసనీయమైన పరపతి విధానాలు కీలకమని పేర్కొంది. ప్రభుత్వ విధానానికి పునాది రాళ్ల వంటి ఈ రెండింటినీ సరిగ్గా నిర్వహించుకోగలిగితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి రుణాలపై వడ్డీల భారం తగ్గగలదని, పెట్టుబడులకు తోడ్పాటు లభించగలదని రివ్యూ వివరించింది. ’అమృత కాలం’ (ఇప్పటి నుంచి 2047 వరకూ)లో మేడిన్ ఇండియా నినాదాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు, నిలకడగా ఆర్థిక వృద్ధి సాధించేందుకు, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో గట్టి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
పుంజుకుంటోన్న ఎకానమీ..
2019–20 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వృద్ధి గణాంకాలు దాదాపు నాలుగు శాతం అధికంగా నమోదయ్యాయని రివ్యూ వివరించింది. కోవిడ్ మహమ్మారి అనంతరం ఎకానమీ వృద్ధి పటిష్టంగా కోలుకోవడాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. 2022–23లో వృద్ధికి సర్వీసుల రంగం సారథ్యం వహించగలదని వివరించింది. ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటం వల్ల ప్రైవేట్ వినియోగం భారీగా పుంజుకోవడమనేది రాబోయే రోజుల్లో నిలకడగా వృద్ధి సాధించేందుకు తోడ్పడగలదని రివ్యూ తెలిపింది. ప్రైవేట్ వినియోగం, సామర్థ్యాల వినియోగం పెరగడంతో పెట్టుబడులు పెట్టడం కూడా ఊపందుకుంటోందని వివరించింది. గత దశాబ్దకాలంలోనే అత్యధికంగా 2022–23 తొలి త్రైమాసికంలో పెట్టుబడుల రేటు పెరిగిందని తెలిపింది.
చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment