న్యూఢిల్లీ: వివిధ అప్లికేషన్స్ ద్వారా డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ (డ్రాస్), ’డ్రోన్ శక్తి’ని ప్రాచుర్యంలోకి తెచ్చే విధంగా స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన ఐటీఐలలో నైపుణ్యాలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. రక్షణ రంగ సంబంధించి పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాల్లో (ఆర్‌అండ్‌డీ) పాలుపంచుకునేందుకు పరిశ్రమ, స్టార్టప్‌లు, విద్యావేత్తలకు కూడా అనుమతులు ఇవ్వనున్నట్లు, ఇందుకు డిఫెన్స్ ఆర్‌అండ్‌డీ బడ్జెట్ లో 25% కేటాయిస్తున్నట్లు సీతారామన్ చెప్పారు.
స్టార్టప్‌లకు చేయూత
అంకుర సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. 2023 మార్చి 31 వరకూ ఏర్పాటయ్యే స్టార్టప్‌లకు పన్నుపరమైన ప్రోత్సాహకాలు లభిస్తాయని ప్రకటించారు. వాస్తవానికి 2022 మార్చి 31 వరకూ ఏర్పాటైన వాటికే ఈ అర్హత ఉండేది. దీన్ని మరో ఏడాది పొడిగించారు. ఏర్పాటైన తర్వాత పదేళ్ల వ్యవధిలో ఈ సంస్థలకు వరుసగా మూడేళ్ల పాటు పన్ను ప్రోత్సాహకాలు పొందే వీలు ఉంటుంది. 2016 ఏప్రిల్ 1 తర్వాత ప్రారంభమైన స్టార్టప్ సంస్థలు ఆదాయ పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్‌మంత్రిత్వ శాఖల బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన సంస్థలు పదేళ్ల కాలవ్యవధిలో వరుసగా మూడేళ్ల పాటు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment