ఒమిక్రాన్ వేరియంట్ పై నెలకొన్న అనిశ్చితి, సులభ ద్రవ్య లభ్యత విధానాలకు సెంట్రల్ బ్యాంకులు స్వస్తి చెబుతుండడం ఇవన్నీ 2022లో మార్కెట్ల గమనాన్ని నిర్ధేశించనున్నాయి. అనిశ్చితి సమయాల్లోనూ, తాము చేసే పెట్టుబడులకు రిస్క్ మరీ ఎక్కువగా ఉండకూడదని భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇవి ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ల వ్యాల్యూషన్ల ఆధారంగా రెండు విభాగాల మధ్య కేటాయింపులను మారుస్తుంటాయి. కనుక పోర్ట్‌ఫోలియో గురించి ఇన్వెస్టర్ ఎక్కువగా ఆందోళన పెట్టుకోవాల్సిన పని ఉండదు.
పెట్టుబడుల విధానం..
అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం మధ్య (మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు పైగా) ఇన్వెస్ట్ చేసే వారికి రిస్క్ ఉన్నా కానీ ఇవి మంచి రాబడులను ఇస్తాయి. 20–35 శాతం పెట్టుబడులను డెట్ సాధనాలకు కేటాయిస్తాయి. ఈ విభాగంలో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. అచ్చమైన ఈక్విటీ ఫండ్ మాదిరే స్వల్పకాలానికి హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా ఎక్కువ భాగాన్ని ఈక్విటీలకే కేటాయిస్తుంటాయి. మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం ఈక్విటీలకు 70–75 శాతం మధ్య పెట్టుబడులను కేటాయిస్తుంటుంది. వృద్ధికి మెరుగైన అవకాశాలు ఉండి, హేతుబ్ధమైన వ్యాల్యూషన్ల వద్ద లభించే స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. ఇందుకోసం బోటమ్ అప్ విధానాన్ని అనుసరిస్తుంది.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,229 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీలకు 74.9 శాతం పెట్టుబడులను కేటాయించింది. డెట్‌లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి, మిగిలిన ఆస్తులను నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌లో 50 శాతం, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 11 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 25 శాతం పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, కన్‌స్ట్రక్షన్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
రాబడులు
అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం గడిచిన మూడేళ్లలో సగటున 7.9 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ ఇదే విభాగంలోని మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 16 శాతానికి పైనే సగటు వార్షిక రాబడిని (ట్రెయిలింగ్) ఇచ్చింది. ఐదేళ్లలో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ విభాగం సగటు వార్షిక రాబడి 13.7 శాతం దగ్గర ఉంటే, ఈ పథకంలో రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏ కాలంలో చూసినా కానీ ఈ పథకం పనితీరు పరంగా ముందుండడాన్ని గమనించొచ్చు. మార్కెట్ల దిద్దుబాటు సమయంలో నష్టాలను కూడా పరిమితంగా ఉండే విధానాలను అనుసరిస్తుంది. డెట్ విభాగంలో అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఏఏఏ రేటింగ్ కలిగిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుంటుంది. డెట్‌లో రిస్క్ తీసుకోదు.
చదవండి: Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్
Comments
Please login to add a commentAdd a comment