‘బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదే సుమతీ‘ అని సుమతీ శతకకారుడి పద్యంలో చదువుకున్నాం. అలాగే స్టాక్ మార్కెట్ల చిన్న చిన్న ఇన్వెస్టర్లంతా కూడబలుక్కుని బడా ఇన్వెస్టర్లపై పడితే? ఎలా ఉంటుంది? అచ్చం అమెరికాలో గేమ్‌స్టాప్ కంపెనీ షేర్ల కహానీలా ఉంటుంది. సోషల్ మీడియాలో చిన్న ఇన్వెస్టర్లు కూడబలుక్కుని బడా ఫండ్స్‌కు ముచ్చెమటలు పట్టించిన ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక అంశాల్లోనూ సోషల్ మీడియా సత్తా చాటుతోంది.
అమెరికాకు చెందిన గేమ్‌స్టాప్ (జీఎంఈ) అనేది ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో గేమ్స్ విక్రయ సంస్థ. అయితే, ఆన్‌లైన్ గేమింగ్ ప్రాచుర్యంలోకి వచ్చే కొద్దీ దీని ప్రాభవం తగ్గుతూ వచ్చింది. గత నాలుగేళ్లుగా ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. దీనికి తగ్గట్లుగానే షేరు కూడా అయిదేళ్ల వ్యవధిలో దాదాపు 90 శాతం పడిపోయింది. కంపెనీ ఇంకా కష్టాల్లో కూరుకుపోతుందనే అంచనాలతో జీఎంఈ షేర్లను షార్ట్ చేసిన హెడ్జ్ ఫండ్స్ గణనీయంగా లాభపడ్డాయి. కొద్ది రోజుల క్రితం దాకా అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
సోషల్ మీడియా ఇన్వెస్టర్ల ఎంట్రీ..
రెడిట్ అనే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లో వాల్ స్ట్రీట్ బెట్స్ (డబ్ల్యూఎస్‌బీ) పేరుతో ఉన్న డిస్కషన్ ఫోరంలో రిటైల్ ఇన్వెస్టర్లు.. వివిధ స్టాక్స్ గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇందులోనే .. జీఎంఈకి వ్యాపారపరంగా సవాళ్లున్నప్పటికీ కంపెనీ కోలుకుంటుందని, షేరు కూడా పుంజుకుంటుందని మెల్లగా చర్చలు మొదలయ్యాయి. రిటైలర్లు షేర్లను కొనడం మొదలుపెట్టడంతో రేటు కూడా క్రమంగా పెరగడం మొదలైంది. దీంతో కొందరు షార్ట్ సెల్లర్లు కాస్త నష్టానికి పొజిషన్లను కవర్ చేసుకున్నారు. మరికొందరు మాత్రం రేటు మళ్లీ తగ్గుతుందనే ఉద్దేశంతో పొజిషన్లు కొనసాగించారు. షేరు ఒక రేటు దగ్గర స్థిరపడుతున్న తరుణంలో.. భారీగా షార్ట్ సెల్లింగ్ పొజిషన్లు ఉన్నాయన్న సంగతిని రెడిట్ ఫోరంలోని చిన్న ఇన్వెస్టర్లు గుర్తించారు. క్రమంగా షేర్లను కొనడం ప్రారంభించారు.
నెమ్మదిగా మొదలైన ఈ కొనుగోళ్లు ఆ తర్వాత తుఫాన్‌లా మారాయి. 2020 డిసెంబర్ 31న 18 డాలర్లుగా ఉన్న షేరు ధర 2021 జనవరి 28 నాటికి ఏకంగా 483 డాలర్లకు ఎగిసింది. 2,583 శాతం పెరిగిపోయింది. దీంతో షార్ట్ చేసి కూర్చున్న బడా సంస్థలు .. పొజిషన్లను కవర్ చేసుకునేందుకు ఆదరాబాదరాగా పరుగులు తీశాయి. అయినప్పటికీ భారీగా నష్టాలు తప్పలేదు. ఉదాహరణకు సిట్రన్ క్యాపిటల్ అనే హెడ్జ్ ఫండ్ .. జీఎంఈ షేరును 40 డాలర్ల దగ్గర షార్ట్ చేసింది. 20 డాలర్ల దగ్గరకు వస్తే కొనుగోలు చేసి లాభాలు గడించవచ్చనుకుంది. కానీ ఎకాయెకీ ర్యాలీ చేయడంతో లాభాల సంగతి పక్కన పెట్టి 100% నష్టానికి 80 డాలర్ల దగ్గర కవర్ చేసుకుని బతుకుజీవుడా అని బైటపడింది. ఇక మెల్విన్ క్యాపిటల్ అనే మరో సంస్థ 2.75 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.20,000 కోట్లు) నష్టపోవాల్సి వచ్చింది. ఇలా బడా ఫండ్స్‌కి చెమట్లు పట్టించిన చిన్న ఇన్వెస్టర్లు అటు పైన ఇలాంటి భారీ షార్ట్ పొజిషన్లు ఉన్న స్టాక్స్ ఇంకా ఉన్నాయేమోనని వేట మొదలెట్టారు.
రివర్స్ గేర్..: అయితే, కథ ఇక్కడితో అయిపోలేదు. చిన్న ఇన్వెస్టర్ల చేసిన హంగామాతో గేమ్‌స్టాప్ షేరు అమాంతం పెరిగినప్పటికీ.. బడా ఇన్వెస్టర్లు సర్దుకుని మళ్లీ పరిస్థితిని క్రమంగా తమ చేతుల్లోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో షేరు పెరిగినంత వేగంగా.. రివర్స్ గేరు వేసింది. వారం క్రితం 483 డాలర్ల స్థాయిని తాకిన స్టాక్ తాజాగా 77 డాలర్లకు పడిపోయింది.
మన దగ్గర...
అమెరికాలో కాబట్టి ఇది సాధ్యపడింది కానీ భారత్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే ఇలాంటివి జరగడానికి ఆస్కారం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. మన దగ్గర షార్ట్ సెల్లింగ్‌పై ఆంక్షలు, సర్క్యూట్ ఫిల్టర్లు మొదలైన నిబంధనలు కఠినతరంగా ఉండటం ఇందుకు ఒక కారణం కాగా అమెరికన్ ఇన్వెస్టర్లంతగా దేశీ ఇన్వెస్టర్లకు ఇలాంటి అంశాలపై అంత పట్టు లేకపోవడం మరో కారణమని విశ్లేషిస్తున్నారు.
షార్ట్ సెల్లింగ్ అంటే..
చేబదులు తీసుకున్న షేర్లను మార్కెట్లో అమ్మేసి, రేటు తగ్గాక కొనుక్కుని బాకీ తీర్చేయడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. అనుకున్న విధంగా రేటు తగ్గితే లాభం వస్తుంది. కానీ పరిస్థితి రివర్సయి రేటు పెరిగిపోయిందంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment