వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురికావడం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రూపాల్లో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) డైరెక్టర్ జెర్రీరైస్ తెలిపారు. చైనాపై ఈ ప్రభావం తక్కువేనన్నారు. చమురు ధరలు గణనీయంగా పెరగడం స్థూల ఆర్థికంగా ఎక్కువ కుదుపులకు గురి చేస్తుందన్నారు. ‘‘అధిక ద్రవ్యోల్బణం కరెంటు ఖాతా లోటుకు దారితీస్తుంది.
అయితే భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులకు అధిక కమోడిటీ ధరల దన్నుతో కరెంటు ఖాతా లోటును కొంత వరకు సర్దుబాటు చేసుకోవచ్చు’’ అని రైస్ తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం యూఎస్, ఈయూ, చైనాలపై ప్రభావం చూపిస్తుంది కనుక.. భారత ఎగుమతులకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంటుందన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు, పెరిగిన అనిశ్చితి దేశీయ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చని, అధిక రుణ వ్యయాలు ద్రవ్య పరిస్థితిని నిర్ణయిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత వృద్ధి చుట్టూ ఎన్నో అనిశ్చితులున్నట్టు పేర్కొన్నారు.
భారత్‌పై చమురు భారం : ఎస్‌అండ్‌పీ అంచనా
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చమురును గణనీయంగా దిగుమతి చేసుకునే భారత్, థాయిలాండ్‌పై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అధికంగా ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే) భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించొచ్చని అంచనా వేసింది. 2023–24లో 6 శాతం, 2024–25లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (మార్చితో ముగిసే/2021–22) ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని తెలిపింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) బ్యాంకులు రష్యాతో స్వల్ప స్థాయిలోనే ఎక్స్‌పోజర్ కలిగి ఉన్నందున యుద్ధం తాలూకు ప్రభావం వాటిపై స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో ఉన్న అతిపెద్ద రిస్క్‌లలో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులకుతోడు.. అధిక కమోడిటీ చార్జీలను ప్రస్తావించింది. ముఖ్యంగా ఇంధనాన్ని అధికంగా దిగుమతి చేసుకునే ఆర్థిక వ్యవస్థలకు రిస్క్ ఎక్కువ ఉన్నట్టు చెప్పింది. దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులపైనే భారత్ ఆధారపడిన విషయం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు వెళ్లి 100 డాలర్ల దిగువకు రావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment