న్యూఢిల్లీ: రాబోయే కొన్ని సంవత్సరాల్లో కొత్త ప్రాజెక్టుల కొనుగోలు, అభివృద్ధిపై 1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు రియల్టీ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్‌షా గోద్రెజ్ వెల్లడించారు. అధిక వృద్ధి సాధన లక్ష్యాల్లో భాగంగా ఈ మేరకు ప్రణాళికలను అమలు చేయనున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో ఆయన వివరించారు. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ 14 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 6,725 కోట్లకు చేరాయని గోద్రెజ్ తెలిపారు. మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) నమోదు చేసిన రూ. 6,000 కోట్ల బుకింగ్స్ స్థాయిని అధిగమించినట్లు వివరించారు.
‘రోజుకు సగటున 25 గృహాల చొప్పున మొత్తం 9,345 గృహాలను విక్రయించాం‘ అని గోద్రెజ్ పేర్కొన్నారు. మార్చి నెలలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ప్రక్రియ ద్వారా రూ. 3,750 కోట్లు సమీకరించిన నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మిగులు నిధులతో ముగించినట్లయిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం వ్యాపార అభివృద్ధికి పటిష్టమైన అవకాశాలు ఉన్నట్లు గోద్రెజ్ వివరించారు. ప్రధానంగా ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)పై ప్రధానంగా దృష్టి పెడుతున్న గోద్రెజ్ ప్రాపర్టీస్.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో కీలక మార్కెట్లో సుమారు రూ. 1,300 కోట్ల పైగా విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment