
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి అటూఇటుగా కదులుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి బంగారం, వెండి ధరలపై ప్రభావాన్ని చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్వల్ప నష్టాలతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 36 తగ్గి రూ. 50,925 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 239 క్షీణించి రూ. 62,042 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 51,065 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,819 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక తొలుత ఒక దశలో 62,085 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,881 వరకూ క్షీణించింది.
కామెక్స్‌లో..
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి దాదాపు యథాతథంగా 1,911 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ నామమాత్ర వృద్ధితో 1,909 డాలర్ల సమీపానికి చేరింది. వెండి మాత్రం 0.4 శాతం క్షీణించి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది.
స్వల్ప లాభాలు
ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల బంగారం నామమాత్రంగా రూ. 20 పెరిగి రూ. 50,950 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,114 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,704 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 344 పుంజుకుని రూ. 62,250 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,580 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,510 వరకూ వెనకడుగు వేసింది.