సాధారణంగా మనం మన గురించి ఆలోచించకుండా పక్కనోడి గురించి ఆలోచిస్తుంటాం. వాళ్లేం చేస్తున్నారు? వీళ్లేం చేస్తున్నారు? ఫలానా వాళ్ల పిల్లలు ఏం చేస్తున్నారు’ అని తెలుసుకునేందుకు అత్యుత్సాహం చూపిస్తుంటాం. ఇప్పుడు అలాంటి అత్యుత్సాహమే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కొంప ముంచింది. బదులుగా రూ.41 వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.
సెర్చింజిన్ విభాగంలో గూగుల్ పెత్తనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర కంపెనీలు ఎదగనీయకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుందంటూ గూగుల్‌పై ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ సంస్థలు కోర్టు మెట్లక్కిన దాఖలాలు అనేకం ఉన్నాయి.
2020లో గూగుల్‌పై కేసు
వాటిల్లో 2020లో అమెరికా న్యూయార్క్ కేంద్రంగా సేవలందించే బోయిస్ షిల్లర్ ఫ్లెక్స్నర్ ఎల్‌ఎల్‌పీ (Boies Schiller Flexner LLP) అనే న్యాయ సంస్థ గూగుల్‌పై కోర్టులో కేసు వేసింది. ‘‘ గూగుల్ బ్రౌజర్ ఇన్‌కాగ్నటోమోడ్‌తో పాటు ఇతర ప్రైవేట్ బ్రౌజర్‌లు ఉపయోగించే యూజర్లు వాటిల్లో ఏం వెతుకుతున్నారు అని సమాచారం తెలుసుకుంటుంది. ఆయా విభాగాలకు చెందిన సైట్లను వీక్షించే యూజర్లకు అనుగుణంగా యాడ్స్‌ను ప్రసారం చేస్తుంది. తద్వారా భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటుంది’’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది.
అయితే సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు నుంచి బయట పడేందుకు గూగుల్ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. విచారణలో క్లాస్ యాక్షన్ పిటిషన్ పై పరిష్కారం కోసం గూగుల్ ప్రాథమికంగా ఓ ఒప్పందానికి వచ్చిందని కాలిఫోర్నియా కోర్టు న్యాయవాదులు ధృవీకరించారు
ఒక్కో యూజర్‌కు
ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు, వారి గూగుల్ ఖాతాలోకి లాగిన్ చేయనప్పటికీ, సంస్థ గూగుల్ అనలటిక్స్ ద్వారా ట్రాఫిక్ ఎంత వస్తుందని గూగుల్ ట్రాక్ చేస్తుంది. గూగుల్ ఈ తరహా వ్యాపార కార్యకలాపాలు చేసినందుకుగాను ఒక్కో యూజర్‌కు 5 వేల డాలర్లు చెల్లించాలి. అలా ఎంపిక చేసిన యూజర్లకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.41వేల కోట్లని తేలింది. అయితే, గూగుల్ ఈ కేసులో ఎలాంటి ముందుస్తు చెల్లింపులు చేయలేదని సమాచారం.
ముందు తిరస్కరించినా.. చివరికి దారికొచ్చిన గూగుల్
ఈ కేసును న్యాయమూర్తి ద్వారా పరిష్కరించాలన్న గూగుల్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఆ పిమ్మట వారం రోజుల వ్యవధిలో గూగుల్ కేసును సెటిల్‌మెంట్ చేసేందుకు మొగ్గు చూపినట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. తదుపరి విచారణ ఫిబ్రవరి 24, 2024లో జరగనుంది. అప్పుడే 41వేల కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చిన గూగుల్ నిర్ణయంపై న్యాయస్థానం ఆమోదం తెలపనుంది.
Comments
Please login to add a commentAdd a comment