హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో తయారు చేయాలని నిర్ణయించింది. దేశీయ మార్కెట్‌తోపాటు విదేశాలకు వీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్లు చైనా, వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి.
ఇటీవల విడుదలైన పిక్సెల్ 8 సిరీస్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదార్లను ఆకట్టుకుంటోంది. తొలుత పిక్సెల్ 8 మోడల్ ఫోన్లు మేడిన్ ఇండియా ట్యాగ్‌తో రానున్నాయి. పిక్సెల్ 8 ప్రో మోడల్ సైతం ఇక్కడ రూపొందే చాన్స్ ఉంది. దేశీయంగా పిక్సెల్ ఫోన్ల తయారీకై తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, భారత్‌కు చెందిన డిక్సన్ టెక్నాలజీస్ పోటీపడుతున్నట్టు సమాచారం. 2016 నుంచి అంతర్జాతీయంగా సుమారు 4 కోట్ల పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో ఒక కోటి యూనిట్లు గడిచిన 12 నెలల్లో అమ్ముడవడం విశేషం.
వచ్చే ఏడాది నుంచి..
మేడిన్ ఇండియా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటాయని గూగుల్ డివైసెస్, సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో గురువారం వెల్లడించారు. ఇందుకోసం అంతర్జాతీయ, దేశీయ ఒప్పంద తయారీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని గూగుల్ ఫర్ ఇండియా 2023 కార్యక్రమంలో పేర్కొన్నారు. గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను దేశంలో తయారు చేయాలనే నిర్ణయం భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడం, అలాగే ప్రత్యర్థి చైనాతో పోటీ పడాలనే భారత లక్ష్యానికి పెద్ద ప్రోత్సాహం. క్రోమ్‌బుక్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తిలో పేరెన్నికగల హెచ్‌పీ ఇటీవలే గూగుల్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే.
భారత్‌లో ఇప్పటికే యాపిల్..
కొన్నేళ్లుగా యాపిల్ తన తయారీ స్థావరాన్ని విస్తరించాలని కోరుకుంటోంది. ఇందుకోసం చైనా+1 విధానంలో భాగంగా భారత్‌లో పలు ఉపకరణాలను అసెంబ్లింగ్ చేస్తోంది. గత నెలలో ఐఫోన్ 15 విడుదల యాపిల్ ఇండియా తయారీ ప్రణాళికలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.
భారత్‌లో, అలాగే చైనాలో ఉత్పత్తి అయిన
ఐఫోన్స్‌ను ఒకే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా యాపిల్ విడుదల చేయడం ఇందుకు కారణం. సాధారణంగా భారత్‌లో యాపిల్ తాజా మోడళ్ల ఉత్పత్తి చైనా కంటే కొన్ని నెలలు వెనుకబడి ఉంటుంది. 2025 నాటికి భారత్‌లో 25 శాతం ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్ లక్ష్యంగా చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment