
దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై సుంకం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగుమతుల సుంకం (export duty) నుంచి 'బెంగళూరు రోజ్' (Bangalore Rose) రకం ఉల్లికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మినహాయింపునిచ్చింది.
కొన్ని షరతులకు లోబడి 'బెంగళూరు రోజ్' ఉల్లికి ఎగుమతి సుంకం నుంచి మినహాయింపును మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగుమతిదారు ఎగుమతి చేయాల్సిన బెంగళూరు రోజ్ రకం ఉల్లి ఉత్పత్తులు, పరిమాణాన్ని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ఉద్యాన కమిషనర్ నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి, దేశీయంగా లభ్యతను పెంచడానికి గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఉల్లిపాయలపై 40 శాతం ఎగమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉల్లి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బెంగళూరు రోజ్' రకం ఉల్లికి మాత్రం ఎగుమతి సుంకం మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.