సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత (2017 జూలై 1) ఒక్క నెలలో అత్యధిక పన్ను వసూళ్ల రికార్డు 2020 డిసెంబర్ నెలకు నమోదైంది. ఏకంగా 1,15,174 కోట్ల మేర జీఎస్‌టీ రూపంలో పన్ను వసూలైంది. 2019 డిసెంబర్‌లో ఉన్న రూ.1.03 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే 12 శాతం వృద్ధి నెలకొంది. లాక్‌డౌన్‌ల తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో వేగాన్ని ఈ వసూళ్లు తెలియజేస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. 2019 ఏప్రిల్ నెలలో రూ.1,13,866 కోట్ల జీఎస్‌టీ ఆదాయం ఇప్పటివరకు రికార్డుగా ఉంది.
ఆర్థిక రికవరీ వేగవంతం
‘‘జీఎస్‌టీ ఆదాయం క్రమంగా పెరగడం, సున్నితమైన రూ.లక్ష కోట్ల మార్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా మూడో నెలలోనూ దాటడం అన్నది.. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక రికవరీ వేగాన్ని సంతరించుకోవడంతోపాటు, జీఎస్‌టీ ఎగవేతలకు, నకిలీ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమం వల్లే’’నని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జీఎస్‌టీ వసూళ్లన్నవి ఆర్థిక కార్యకలాపాల వాస్తవ చిత్రాన్ని తెలియజేసేవే. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2020 మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి నెల ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్‌టీ వసూళ్లు రూ.32,172 కోట్లకు పడిపోయాయి. మే తర్వాత నుంచి లాక్‌డౌన్ నియంత్రణలను క్రమంగా సడలిస్తూ రావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే జీఎస్‌టీ వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.
‘‘పెద్ద రాష్ట్రాలు జీఎస్‌టీ వసూళ్లలో 6–15 శాతం మధ్య వృద్ధిని చూపించాయి. వరుసగా జీఎస్‌టీ ఆదాయాలు వృద్ధిని చూపిస్తుండడం ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా తిరిగి మొదలయ్యాయని, వస్తు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండడాన్ని తెలియజేస్తోంది’’ అని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అమిత్ గుప్తా తెలిపారు. పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని జీఎస్‌టీ ఆదాయంలో వృద్ధి తెలియజేస్తోందంటూ సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. కోవిడ్–19 కారణంగా కుంగిన ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగాన్ని సంతరించుకున్నట్టు వస్తు సేవల పన్ను వసూళ్లు స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 2020 మాసంలో రూ. 2,581 కోట్ల మేర జీఎస్‌టీ వసూలైంది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో రూ. 2,265 కోట్ల జీఎస్‌టీ వసూలవగా.. దీంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది. తెలంగాణలో 2019 డిసెంబర్‌లో జీఎస్‌టీ ఆదాయం రూ. 3,420 కోట్లుగా ఉంటే.. 2020 డిసెంబర్ లో 4 శాతం వృద్ధితో రూ. 3,542 కోట్ల మేర వసూలైంది.
ఇతర వివరాలు..
► 2020 డిసెంబర్‌లో సెంట్రల్ జీఎస్‌టీ రూ.21,365 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ రూ.27,804 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.57,426 కోట్లు, సెస్సు రూ.8,579 కోట్లుగా ఉంది.
► ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ నుంచి రూ.23,276 కోట్లు సెంట్రల్ జీఎస్‌టీకి, రూ.17,681 కోట్లు స్టేట్ జీఎస్‌టీకి కేంద్రం సర్దుబాటు చేసింది. ఆదాయ వాటా పరిష్కారం అనంతరం.. డిసెంబర్ నెలకు సంబం ధించి కేంద్రానికి సెంట్రల్ జీఎస్‌టీ ఆదాయం రూ.44,641 కోట్లు, రాష్ట్రాలకు స్టేట్ జీఎస్‌టీ ఆదాయం రూ.45,485 కోట్లుగా ఉంది.
► నవంబర్ నెలకు సంబంధించి జీఎస్‌టీఆర్–3బీ రిటర్నులు డిసెంబర్ 31 నాటికి 87 లక్షలు దాఖలయ్యాయి.
రికార్డు స్థాయి జీఎస్‌టీ ఆదాయం
Published Sat, Jan 2 2021 5:16 AM | Last Updated on Sat, Jan 2 2021 5:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment