ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. 2023లో ఇప్పటివరకు పాలసీ రేట్లపై ఆర్‌బీఐ విరామం కొనసాగించిందన్నారు. ప్రస్తుతం వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయని, అవి ఇంకెంతకాలం కొనసాగుతాయో చెప్పలేమన్నారు. శుక్రవారం జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు.
భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తోడవ్వడంతో ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ సైతం గతేడాది మేనెల నుంచి దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. అయితే, ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని శక్తికాంత దాస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.(వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్)
ప్రపంచ వృద్ధిలో మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్‌బీఐతో సహా సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని సూచించారు.
క్రూడాయిల్ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఇంకా రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment