న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచేందుకు కేంద్ర సర్కారు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ప్రకటించినప్పటికీ.. దేశీ తయారీని పెంచేందుకు ఇది చాలదని, విదేశాల్లో తయారై ఇక్కడకు దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుంకాలను పెంచాలని పరిశ్రమ కోరుతోంది. త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి తీసుకొచ్చే బడ్జెట్‌లో తమ డిమాండ్లకు చోటు కల్పిస్తారని పరిశ్రమ భావిస్తోంది. అలాగే, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), స్థానిక ప్రాజెక్టులను పీఎల్‌ఐలో భాగం చేయాలని కోరుతోంది. ‘‘స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు విడిభాగాలు, తుది తయారీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల విషయంలో 5 శాతం అంతరమైనా ఉండాలి.
అప్పుడే దేశీ తయారీకి బలం లభిస్తుంది’’ అని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల కాలానికి ఎల్‌ఈడీలపై సుంకాలకు సంబంధించి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించాలని కోరారు. ఆర్‌అండ్‌డీ ప్రాజెక్టుపై వ్యయాలకు 200 శాతం పన్ను మినహాయింపు ఉండాలన్నారు. ఏసీలపై జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించొచ్చని, అలాగే, 105 సెంటీమీటర్లకంటే ఎక్కువ పరిమాణం తెరల టీవీలపైనా ఇదే రీతిలో పన్ను తగ్గించొచ్చని పరిశ్రమ భావిస్తున్నట్టు చెప్పారు. విద్యుత్‌ను ఆదా చేసే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించాలని కూడా పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.
‘ఈవీ ఫైనాన్స్’కు ప్రాధాన్య రంగం హోదా
ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే రుణాలను ‘ప్రాధాన్య రంగం రుణాలు’గా పరిగణించాలని ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల సొసైటీ (ఎస్‌ఎంఈవీ) బలంగా డిమాండ్ చేస్తోంది. బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనకు చోటు కల్పించాలని కోరుతోంది. ఈవీల వినియోగం విస్తరణకు ఇది కీలకమని భావిస్తోంది. దీనివల్ల తక్కువ వడ్డీ రేట్లకే రుణాలపై ఈవీల కొనుగోళ్లకు ప్రజలు ముందుకు వస్తారని ఎస్‌ఎంఈవీ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో బ్యాటరీల అభివృద్ధికి (ఆర్‌అండ్‌డీ) తగినన్ని నిధులను కేటాయించాలని ఆశిస్తోంది. ఇప్పటికే తమ డిమాండ్లను పరిశ్రమ కేంద్ర ఆర్థిక శాఖకు తెలియజేసింది.
ఫార్మాలో ఆర్‌అండ్‌డీని ప్రోత్సహించాలి
ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)ని ప్రోత్సహించే విధానాలకు బడ్జెట్‌లో చోటు కల్పించాలని ఈ రంగం కోరుకుంటోంది. ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ‘‘నేషనల్ హెల్త్ పాలసీ 2017లో పేర్కొన్నట్టుగా హెల్త్‌కేర్ రంగానికి బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుతమున్న 1.8 శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలి. బయోఫార్మాస్యూటికల్‌కు ఆర్‌అండ్‌డీ కీలకం కనుక, వీటికి ప్రత్యేక కేటాయింపులు చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు వినతులు సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment