Electronics Manufacturing Base
-
స్టోరేజ్ చిప్సెట్స్ తయారీలోకి మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న మైక్రోమ్యాక్స్, తైవాన్‌కు చెందిన స్టోరేజ్ చిప్ కంపెనీ ఫీజన్ తాజాగా మిఫీ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేశాయి. ఈ జేవీ కృత్రిమ మేధస్సుతో (ఏఐ) కూడిన స్టోరేజ్ చిప్సెట్ మాడ్యూళ్లను రూపొందించి, తయారు చేస్తుంది. నోయిడా ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభించామని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ కో–పౌండర్ రాహుల్ శర్మ గురువారం తెలిపారు. ‘ఎన్ఏఎన్డీ కంట్రోలర్, ఎన్ఏఎన్డీ స్టోరేజ్ టెక్నాలజీలలో ఫీజన్ అగ్రగామిగా ఉంది. జేవీలో మైక్రోమ్యాక్స్‌కు 55 శాతం, ఫీజన్కు 45 శాతం వాటా ఉంది’ అని శర్మ చెప్పారు. భద్రత, వ్యూహాత్మక దృక్కోణం నుండి ఏ దేశానికైనా సర్వర్స్ చాలా ముఖ్యమైన అంశం అని అన్నారు. స్టోరేజ్ చిప్సెట్ల రూపకల్పనపై సంస్థ దృష్టి సారిస్తుందని చెప్పారు. ధర పదో వంతుకు తగ్గింపు.. ఈ వెంచర్‌తో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) ధరను పదో వంతు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ వెల్లడించారు. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇది భారత్‌లోనే కాకుండా ఇతర మార్కెట్లలోనూ సంచలనం కలిగిస్తుందని చెప్పారు. భారత్‌లోని కొన్ని ప్రముఖ సంస్థలతో ట్రయల్స్ ఈ నెలలో పూర్తవుతాయని, 2025 మొదటి త్రైమాసికంలో వాణిజ్య పరంగా సరఫరా ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘స్టోరేజ్ పరిష్కారాలను అందించే కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. స్వదేశీ స్టోరేజ్ సొల్యూషన్స్ కంపెనీ లేని దేశాలకు.. ముఖ్యంగా భారత్‌కు ఇది చాలా ముఖ్యం. మా జాయింట్ వెంచర్ మన స్వంత డిజైన్, తయారీని కలిగి ఉండటం వల్ల విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది’ అని శర్మ చెప్పారు. మూడేళ్లలో 1,000 మంది.. కంపెనీ ఫ్రెషర్లను నియమించి వారికి స్టోరేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై శిక్షణ ఇస్తుందని రాహుల్ తెలిపారు. ‘మా కాన్సెప్ట్ మొదట భారత్ కోసం.. ఆ తరువాత ప్రపంచం కోసం రూపొందించబడింది. రెండు ఏళ్లలో మొదటి డిజైన్‌ను సిద్ధం చేయాలనేది మా ఆకాంక్ష. మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో 1,000 ఇంజనీర్లను కలిగి ఉండాలని భావిస్తున్నాం. వీరందరికీ ఫీజన్ శిక్షణ ఇస్తుంది. కంపెనీ ఇప్పటికే ఉన్న తయారీ సంస్థల నుండి వేఫర్లను కొనుగోలు చేస్తుంది. స్టోరేజ్ మాడ్యూల్స్ తయారీకి వాటిని ఉపయోగిస్తుంది’ అని వివరించారు. -
Samsung : రూ.10,000 కోట్ల వ్యాపార లక్ష్యం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం శామ్సంగ్ టీవీల అమ్మకాల ద్వారా 2024లో భారత మార్కెట్లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకోవడం ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించలేదని కంపెనీ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం టీవీల విభాగంలో పరిమాణం పరంగా వృద్ధిలో ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా విజువల్ డిస్ప్లే బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. ‘ప్రీమియం టీవీలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. కంపెనీ విక్రయాల్లో ఈ విభాగం వాటా 40%. యూహెచ్డీ, పెద్ద స్క్రీన్ టీవీల విక్రయాలతో ఈ ఏడాది వృద్ధి ఉంటుంది. ప్రీమియం ఉత్పత్తులకు మెట్రోలు, చిన్న పట్టణాల నుంచీ డిమాండ్ ఉంది’ అని వివరించారు. సంస్థకు 21 శాతం వాటా.. శామ్సంగ్ భారత్‌లో 2022–23లో రూ.98,924 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇందులో 70 శాతం మొబైల్స్ అమ్మకాల ద్వారా కాగా మిగిలినది టీవీలు, ఇతర ఉపకరణాల ద్వారా సమకూరింది. దేశీయ టీవీల విపణిలో పరిమాణం పరంగా సంస్థకు 21 శాతం వాటా ఉంది. శామ్సంగ్ తాజాగా ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టింది. పిక్చర్ స్పష్టంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.1.39 లక్షలు. ఓఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.1.64 లక్షలు. కాగా, శామ్సంగ్ దేశీ విక్రయ టీవీల్లో 90% భారత్‌లో తయారైనవే. దేశంలో ఏటా అన్ని బ్రాండ్లలో కలిపి 1.2 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. -
ఎల్రక్టానిక్స్ తయారీ 4 రెట్లు అప్..
గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ నాలుగు రెట్లు పెరిగి రూ. 8.22 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో తెలిపారు. ఇది 2026 నాటికి రూ. 23.95 లక్షల కోట్లకు చేరనుందన్నారు. 2013–14లో ఎలక్ట్రానిక్స్ తయారీ రూ. 1.80 లక్షల కోట్లుగా ఉండేదని మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఉపయోగిస్తున్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో 99.2 శాతం దేశీయంగా తయారైనవే ఉంటున్నాయని ఆయన వివరించారు. 2022–23లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువ చేసే మొబైల్స్‌ను ఎగుమతి చేసినట్లు చంద్రశేఖర్ చెప్పారు. భారత్ ఎలక్ట్రానిక్స్‌ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి ఎగుమతి చేసే దేశం స్థాయికి ఎదిగిందన్నారు. -
నానో ప్రపంచం దగ్గరయింది
బంగారం ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా? ముదురు పసుపునకు కొంత కాంతి చేరిస్తే ఉండే రంగు. కానీ, ఇదే బంగారాన్ని నానోస్థాయిలో.. అంటే మన వెంట్రుకలో పదివేల వంతు సూక్ష్మస్థాయిలో చూస్తే దాని రంగు ఎరుపు లేదా వంగపూతగా కనిపిస్తుంది! అదెలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నానోస్థాయిలో పదార్థాల ధర్మాల ఆసరాతో అత్యాధునిక ఎల్రక్టానిక్స్ తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కిందని మాత్రం తెలుసుకోవాలి! ఆ విశేషాలేమిటో చూసేద్దాం.. క్వాంటమ్ డాట్స్ తయారీకి బాటలు నానోటెక్నాలజీ మనకేమీ కొత్త కాదు. చాలా కాలంగా వేర్వేరు రంగాల్లో వాడకంలో ఉన్నదే. స్పష్టమైన, పలుచని ఎల్ఈడీ స్క్రీన్ల తయారీ మొదలుకొని శరీరంలోని కేన్సర్ కణితులను కత్తిరించడం వరకూ రకరకాలుగా నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ అత్యద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలకు బీజం వేసిన క్వాంటమ్ డాట్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు కాబట్టే స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ.. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త లూయిస్ బ్రూస్, నానో క్రిస్టల్స్ టెక్నాలజీ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు ప్రకటించింది. సూక్ష్మస్థాయి కణాల ఉత్పత్తి రసాయన శాస్త్రం చదువుకున్న వారు ఎవరికైనా మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని తెలిసే ఉంటుంది. అయితే మూలకం నానోస్థాయికి చేరిందనుకోండి... సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మూలకం సైజును బట్టి ఈ ధర్మాలుంటాయి. ఉదాహరణకు పైన చెప్పుకున్న బంగారం రంగు! అలాగే సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రా్టనిక్, ఆప్టికల్, ఉ్రత్పేరక ధర్మాలు కూడా మారిపోతాయి. సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని పదార్థాలు సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్ కండక్టర్లుగా వ్యవహరించవచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఈ ఏటి రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం తక్కువని అనుకునేవారు. 1980లో అలెక్సీ ఎకిమోవ్ రంగుల గాజులో క్వాంటమ్ ఎఫెక్ట్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. కణం సైజు ఆధారంగా రంగు మారుతుందని ఆయన నిరూపించడంతో క్వాంటమ్ డాట్స్‌పై ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ల తరువాత ఒక ద్రవంలో స్వేచ్ఛగా కదులుతున్న కణాల సైజుకు అనుగుణంగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ మారుతాయని మొట్టమొదటిసారి నిరూపించగలిగారు. భవిష్యత్తులో సురక్షితమైన సమాచార వ్యవస్థ! 1993లో మౌంగి బావెండీ రసాయనికంగా క్వాంటమ్ డాట్స్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టడంతో వీటిని మన ప్రయోజనాలకు వాడుకోవడం సులువు అయ్యింది. ఇప్పుడు మన కంప్యూటర్ మానిటర్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్‌లో విస్తృత స్థాయి రంగులు వెదజల్లడం ఈ క్వాంటమ్ డాట్స్ పుణ్యమే. అలాగే మన ఎల్ఈడీ బల్బుల రంగులు మారడానికి కూడా ఇవే కారణం. శరీరంలోని కణజాలాన్ని స్పష్టంగా గుర్తించేందుకు బయో కెమిస్టులు, వైద్యులు ఇప్పుడు క్వాంటమ్ డాట్స్‌ను వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా ఎటు కావాలంటే అటు మడిచేసుకోగల ఎల్రక్టానిక్స్, అతి సూక్ష్మమైన సెన్సార్లు, పలుచటి సోలార్ సెల్స్ తయారీతోపాటు అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. క్వాంటమ్ డాట్స్‌పై పరిశోధనలకు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా సైంటిస్టులకు ప్రతిష్టాత్మక బహుమతి స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతి ఈసారి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మౌంగి బావెండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్ర నోబెల్ ప్రైజ్ లభించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పారి్టకల్స్ అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు కీలక పాత్ర పోషించారని నోబెల్ కమిటీ తెలియజేసింది. ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధికారికంగా విజేతల పేర్లు ప్రకటించకముందే ముగ్గురు సైంటిస్టుల పేర్లను స్వీడన్ మీడియా సంస్థలు బహిర్గతం చేయడం కలకలం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వచ్చే వారం 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: వచ్చే వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు షేరుకి రూ. 347–366 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇక ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో 20న మొదలై 22న ముగియనుంది. వివరాలు చూద్దాం.. రూ. 1,500 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 16న షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. రూ. 475 కోట్లకు పరిమితం ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో ద్వారా రూ. 475 కోట్లు మాత్రమే సమీకరించనుంది. మొదట్లో రూ. 760 కోట్లను సమకూర్చుకోవాలని భావించినప్పటికీ తదుపరి టార్గెట్‌లో కోత పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. తద్వారా ఘజియాబాద్(యూపీ), వెర్నా(గోవా)లోని ప్లాంట్ల విస్తరణను చేపట్టనుంది. లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్ తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
రూ.9,75,600 కోట్ల ఎగుమతులు
చెన్నై: దేశం నుంచి 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.9,75,600 కోట్లకు చేరతాయని కేంద్రం ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ.6,09,750 కోట్లుగా అంచనా. 2026 మార్చినాటికి తయారీ విలువ రూ.24,39,000 కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై సమీపంలో రూ.1,100 కోట్లతో పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా నెలకొల్పిన ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 నాటికి భారత్ 90 శాతం మొబైల్ ఫోన్స్‌ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో 97 శాతం దేశీయంగా తయారైనవే. ఏటా రూ.50,000 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఐఫోన్స్, శామ్సంగ్, ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. ఎనమిదేళ్లలో సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. భారత్ సాధించింది అతి స్వల్పమే. 2025–26 నాటికి రూ.1,62,600 కోట్ల విలువైన మొబైల్స్ భారత్ నుంచి విదేశాలకు సరఫరా అవుతాయని భావిస్తున్నాం. పెగాట్రాన్ సదుపాయాన్ని ప్రారంభించడం, నోయిడా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఇతర తయారీ యూనిట్ల విజయం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని రాజీవ్ తెలిపారు. -
ముఖేష్ అంబానీ ముందు చూపు మామూలుగా లేదుగా..ఇక లాభాలే లాభాలు!!
ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలో 10స్థానంలో ముఖేష్ అంబానీ భవిష్యత్‌ను ముందే ఊహిస్తున్నారు. లాభాలు తెచ్చిపెట్టే టెక్నాలజీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీ పై భారీగా పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా అమెరికాకు చెందిన సన్మీనా కంపెనీలో రూ.1670కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా కేంద్రంగా సన్మీనా 40ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ సర్వీస్‌లను అందిస్తుంది. ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి సుమారు 50.1శాతం స్టేక్‌ను సొంతం చేసుకున్నారు. ఈ పెట్టుబడులతో భారత్ కేంద్రంగా హై టెక్నాలజీ మ్యానఫ్యాక్చరింగ్ విభాగంలో డిజిటల్ ఎకానమినీ వృద్ది సాధించొచ్చని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు. 100 ఎకరాల్లో సన్మీనా క్యాంపస్ సన్మీనాలో పెట్టిన పెట్టుబడుల్ని భారత్‌లో టెలికాం, ఐటీ, డేటా సెంటర్స్, క్లౌడ్, 5జీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలకు చెందిన ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లను తయారు చేయాలని భావిస్తుంది. రిలయన్స్ సమాచారం ప్రకారం.. భారత్‌లో చెన్నై కేంద్రంగా సన్మీనా కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ఇందుకోసం 100ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో పాటు భారత్‌లో మిగిలిన ప్రాంతాల్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించనుంది. చదవండి: 'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్' లిస్ట్‌లో నీతా అంబానీ -
ఎలక్ట్రానిక్ రంగంలోకి ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా ఎలక్ట్రానిక్ తయారీలోకి ప్రవేశించింది. ఇందుకు వీలుగా అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్బీవీఎల్) ద్వారా సాన్మినా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. ప్రధానంగా కమ్యూనికేషన్స్ నెట్వర్కింగ్, రక్షణ, ఏరోస్పేస్ తదితర హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్పై దృష్టిపెట్టనున్నాయి. భాగస్వామ్య సంస్థ(జేవీ)లో ఆర్ఎస్బీవీఎల్ 50.1 శాతం వాటా పొందనుండగా.. సాన్మినాకు 49.9 శాతం వాటా లభించనుంది. సాన్మినాకు దేశీయంగా గల సంస్థలో ఆర్ఎస్బీవీఎల్ రూ. 1,670 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా జేవీలో వాటాను పొందనుంది. ఈ పెట్టుబడితో లభించనున్న 20 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,500 కోట్లు) నగదుతో వృద్ధి అవకాశాలను జేవీ అందిపుచ్చుకోనుంది. కాగా.. ఈ లావాదేవీకి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. సాన్మినా కార్పొరేషన్, ఆర్ఎస్బీవీఎల్ సంయుక్తంగా వెల్లడించిన ఈ డీల్ 2022 సెప్టెంబర్‌కల్లా పూర్తికాగలదని అంచనా. సాన్మినా నిర్వహణలో చెన్నైలోగల సాన్మినా యాజమాన్యం జేవీకి చెందిన రోజువారీ బిజినెస్ కార్యకలాపాలను నిర్వహించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత సాంకేతికతగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్‌వేర్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వనుంది. 5జీ, క్లౌడ్ ఇన్ఫ్రా, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు తదితర కమ్యూనికేషన్స్ నెట్వర్కింగ్, మెడికల్ అండ్ హెల్త్‌కేర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ క్లీన్టెక్, డిఫెన్స్, ఏరోస్పేస్ తదితర వృద్ధికి వీలున్న కీలక రంగాలపై దృష్టి పెట్టనుంది. దేశీయంగా హైటెక్ తయారీకున్న భారీ అవకాశాలను అందిపుచ్చుకునే బాటలో సాన్మినాతో కలసి పనిచేయడానికి సంతోషిస్తున్నట్లు రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వృద్ధి, భద్రతరీత్యా టెలికం, ఐటీ, డేటా సెంటర్లు, 5జీ, నూతన ఇంధన రంగాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశ, విదేశాలలో నెలకొన్న డిమాండుకు అనుగుణమైన కొత్త ఆవిష్కరణలు, ప్రతిభలకు ప్రోత్సాహం లభించగలదని తెలియజేశారు. మేకిన్ ఇండియా విజన్‌కు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ తయారీ కేంద్ర సృష్టి ఈ జేవీ లక్ష్యమని పేర్కొన్నారు. తొలుత చెన్నైలో... 2021 మార్చితో ముగిసిన ఏడాదిలో సాన్మి నా దేశీ యూనిట్.. సాన్మినా ఎస్సీఐ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ 16.5 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 1,230 కోట్లు) ఆదాయం సాధించింది. ఎలక్ట్రానిక్ తయారీని తొలుత పూర్తిగా సాన్మినాకు చెన్నైలోగల 100 ఎకరాల క్యాంపస్‌లోనే చేపట్టనున్నట్లు ఆర్ఎస్బీవీఎల్ వెల్లడించింది. భవిష్యత్ విస్తరణకు సైతం ఇక్కడ వీలున్నట్లు తెలియజేసింది. ఆపై వ్యాపార అవసరాలరీత్యా దేశంలోని ఇతర ప్రాంతాలలో యూనిట్ల ఏర్పాటుకు వీలున్నట్లు వివరించింది. దేశీయంగా సమీకృత తయారీ సొల్యూషన్స్ కంపెనీ ఏర్పాటు కోసం రిలయన్స్‌తో జత కట్టడం తమకు ఉత్తేజాన్నిస్తున్నట్లు సాన్మినా చైర్మన్, సీఈవో జ్యూరె సోలా పేర్కొన్నారు. ఈ జేవీ దేశ, విదేశీ మార్కెట్లకు అవసరమైన ఉత్పత్తులను రూపొందించగలదని తెలియజేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో కీలక మైలురాయిగా నిలవగలదని పేర్కొన్నారు. -
ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై సుంకాలు పెంచాలి
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచేందుకు కేంద్ర సర్కారు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రకటించినప్పటికీ.. దేశీ తయారీని పెంచేందుకు ఇది చాలదని, విదేశాల్లో తయారై ఇక్కడకు దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుంకాలను పెంచాలని పరిశ్రమ కోరుతోంది. త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి తీసుకొచ్చే బడ్జెట్లో తమ డిమాండ్లకు చోటు కల్పిస్తారని పరిశ్రమ భావిస్తోంది. అలాగే, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ), స్థానిక ప్రాజెక్టులను పీఎల్ఐలో భాగం చేయాలని కోరుతోంది. ‘‘స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు విడిభాగాలు, తుది తయారీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల విషయంలో 5 శాతం అంతరమైనా ఉండాలి. అప్పుడే దేశీ తయారీకి బలం లభిస్తుంది’’ అని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల కాలానికి ఎల్ఈడీలపై సుంకాలకు సంబంధించి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించాలని కోరారు. ఆర్అండ్డీ ప్రాజెక్టుపై వ్యయాలకు 200 శాతం పన్ను మినహాయింపు ఉండాలన్నారు. ఏసీలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించొచ్చని, అలాగే, 105 సెంటీమీటర్లకంటే ఎక్కువ పరిమాణం తెరల టీవీలపైనా ఇదే రీతిలో పన్ను తగ్గించొచ్చని పరిశ్రమ భావిస్తున్నట్టు చెప్పారు. విద్యుత్‌ను ఆదా చేసే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని కూడా పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ‘ఈవీ ఫైనాన్స్’కు ప్రాధాన్య రంగం హోదా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే రుణాలను ‘ప్రాధాన్య రంగం రుణాలు’గా పరిగణించాలని ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల సొసైటీ (ఎస్ఎంఈవీ) బలంగా డిమాండ్ చేస్తోంది. బడ్జెట్లో ఈ ప్రతిపాదనకు చోటు కల్పించాలని కోరుతోంది. ఈవీల వినియోగం విస్తరణకు ఇది కీలకమని భావిస్తోంది. దీనివల్ల తక్కువ వడ్డీ రేట్లకే రుణాలపై ఈవీల కొనుగోళ్లకు ప్రజలు ముందుకు వస్తారని ఎస్ఎంఈవీ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో బ్యాటరీల అభివృద్ధికి (ఆర్అండ్డీ) తగినన్ని నిధులను కేటాయించాలని ఆశిస్తోంది. ఇప్పటికే తమ డిమాండ్లను పరిశ్రమ కేంద్ర ఆర్థిక శాఖకు తెలియజేసింది. ఫార్మాలో ఆర్అండ్డీని ప్రోత్సహించాలి ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)ని ప్రోత్సహించే విధానాలకు బడ్జెట్లో చోటు కల్పించాలని ఈ రంగం కోరుకుంటోంది. ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ‘‘నేషనల్ హెల్త్ పాలసీ 2017లో పేర్కొన్నట్టుగా హెల్త్‌కేర్ రంగానికి బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుతమున్న 1.8 శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలి. బయోఫార్మాస్యూటికల్కు ఆర్అండ్డీ కీలకం కనుక, వీటికి ప్రత్యేక కేటాయింపులు చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు వినతులు సమర్పించింది. -
ఎలక్ట్రానిక్ క్లస్టర్లు... ఎనర్జీ పార్కులు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కూడా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016లోనే ఎలక్ట్రానిక్స్ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ వాటా ప్రస్తుతం 7 శాతంకాగా వచ్చే నాలుగేళ్లలో అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, ఈవీ పార్కులకు తోడుగా కొత్త ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన మౌలికవసతులను మెరుగుపరచడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 3 లక్షల ఉద్యోగాలు లభించేలా చూడాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ నైపుణ్య శిక్షణ అకాడమీ (టాస్క్) ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా ఈవీ క్లస్టర్లు, ఎనర్జీ పార్కులు... ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగం కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఔటర్ రింగురోడ్డు సమీపంలోని రావిర్యాలలో ‘ఈ–సిటీ’, మహేశ్వరంలో హార్డ్‌వేర్ పార్క్ 912 ఎకరాల్లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఎల్ఈడీ పార్కులో 10 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా ఈవీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అవసరాల కోసం మరో 3 కొత్త పార్కులు/క్లస్టర్లు ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల కోసం ఈవీ క్లస్టర్‌ను టీఎస్ఐఐసీ అభివృద్ధి చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోనూ 378 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఎనర్జీ పార్కు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పార్కులో లిథియం–అయాన్ బ్యాటరీలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఏర్పాటవుతాయి. కొత్తగా దుండిగల్‌లోనూ 511 ఎకరాల్లో కొత్త ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. వాటితోపాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రొటోటైపింగ్, టెస్టింగ్ వసతులతో కూడిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏడాదిలోనే రూ. 4,500 కోట్ల పెట్టుబడులు... ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరొందిన ఇంటెల్, మైక్రాన్, క్వాల్కామ్, మోటరోలా, ఏఎండీ, సిడాక్, యాపిల్ వంటి కంపెనీలతోపాటు మైక్రోమ్యాక్స్, స్కైవర్త్, ఒప్పో, వన్‌ప్లస్ వంటి మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. గతేడాది ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ. 4,500 కోట్ల పెట్టుబడులతోపాటు 15 వేల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఐదేళ్లపాటు విద్యుత్‌పై 25 శాతం, పెట్టుబడులపై 20 శాతం చొప్పున సబ్సిడీ, ఏడేళ్లపాటు జీఎస్టీలో 100 శాతం మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పెరగాలి టెలికం ఉత్పత్తులపైనా దృష్టి పెట్టాలి అప్పుడే ఆయా రంగాల్లో దిగుమతుల భారం దిగొస్తుంది... టెలికం 2013 సదస్సులో ప్రధాని మన్మోహన్వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రానిక్స్, టెలికం రంగ ఉత్పత్తుల దిగుమతుల విలువ ఏకంగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను మించిపోగలదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీ: ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వీటి ఉత్పత్తి మరింత పెంచే విధంగా తయారీ రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా టెలికం 2013 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 2020 నాటికి భారత్ 300 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చన్న అంచనాలు ఉన్నట్లు, ఇవి పెట్రోలియం ఉత్పత్తులను మించిపోనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇంత భారీస్థాయిలో దిగుమతులకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికి కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, 2012 జాతీయ టెలికం విధానం.... టెలికం రంగంలోని అనేక అంశాలపై స్పష్టత తీసుకువచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, బోధనా పద్ధతుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా విద్యార్థులకు 3జీ కనెక్టివిటీ ఉన్న ట్యాబ్లెట్ పీసీలను అందించడంపై టెలికం కమిషన్ కృషి చేస్తోందని ప్రధాని వివరించారు. టెలికం సమస్యల పరిష్కారంపై దృష్టి.. టెలికం రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోందని టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. పరిశ్రమకు సానుకూలమయ్యే విధంగా నియంత్రణపరమైన సంస్కరణలు చేసిన నేపథ్యంలో స్పెక్ట్రం వేలం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, పరిశ్రమ వర్గాల్లో విభేదాలు కూడా టెలికం రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్రా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చొరవ చూపే ముందు .. పరిశ్రమ వర్గాల మధ్య ఐకమత్యం అవసరమని ఆయన చెప్పారు. 3 వారాల్లో స్పెక్ట్రం వేలానికి దరఖాస్తుల ఆహ్వానం... 2జీ టెలికం స్పెక్ట్రం వేలానికి సంబంధించి 15-20 రోజుల్లో దరఖాస్తులు ఆహ్వానించే అవకాశం ఉందని టెలికం శాఖ కార్యదర్శి ఎంఎఫ్ ఫారూఖీ తెలిపారు. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 400 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్జలో 45 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే.. 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంనకు రిజర్వ్ ధరను సిఫార్సు చేయాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి టెలికం విభాగం ఈ వారంలో లేఖ రాయనున్నట్లు ఫారూఖీ వివరించారు. జనవరిలో నిర్వహించబోయే మూడో విడత స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 11,000 కోట్ల నిధులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది.