మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
- దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పెరగాలి
- టెలికం ఉత్పత్తులపైనా దృష్టి పెట్టాలి
- అప్పుడే ఆయా రంగాల్లో దిగుమతుల భారం దిగొస్తుంది...
- టెలికం 2013 సదస్సులో ప్రధాని మన్మోహన్వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రానిక్స్, టెలికం రంగ ఉత్పత్తుల దిగుమతుల విలువ ఏకంగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను మించిపోగలదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీ: ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వీటి ఉత్పత్తి మరింత పెంచే విధంగా తయారీ రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా టెలికం 2013 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
2020 నాటికి భారత్ 300 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చన్న అంచనాలు ఉన్నట్లు, ఇవి పెట్రోలియం ఉత్పత్తులను మించిపోనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇంత భారీస్థాయిలో దిగుమతులకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికి కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, 2012 జాతీయ టెలికం విధానం.... టెలికం రంగంలోని అనేక అంశాలపై స్పష్టత తీసుకువచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, బోధనా పద్ధతుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా విద్యార్థులకు 3జీ కనెక్టివిటీ ఉన్న ట్యాబ్లెట్ పీసీలను అందించడంపై టెలికం కమిషన్ కృషి చేస్తోందని ప్రధాని వివరించారు.
టెలికం సమస్యల పరిష్కారంపై దృష్టి..
టెలికం రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోందని టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. పరిశ్రమకు సానుకూలమయ్యే విధంగా నియంత్రణపరమైన సంస్కరణలు చేసిన నేపథ్యంలో స్పెక్ట్రం వేలం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, పరిశ్రమ వర్గాల్లో విభేదాలు కూడా టెలికం రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చొరవ చూపే ముందు .. పరిశ్రమ వర్గాల మధ్య ఐకమత్యం అవసరమని ఆయన చెప్పారు.
3 వారాల్లో స్పెక్ట్రం వేలానికి దరఖాస్తుల ఆహ్వానం...
2జీ టెలికం స్పెక్ట్రం వేలానికి సంబంధించి 15-20 రోజుల్లో దరఖాస్తులు ఆహ్వానించే అవకాశం ఉందని టెలికం శాఖ కార్యదర్శి ఎంఎఫ్ ఫారూఖీ తెలిపారు. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 400 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్‌జలో 45 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే.. 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంనకు రిజర్వ్ ధరను సిఫార్సు చేయాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి టెలికం విభాగం ఈ వారంలో లేఖ రాయనున్నట్లు ఫారూఖీ వివరించారు. జనవరిలో నిర్వహించబోయే మూడో విడత స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 11,000 కోట్ల నిధులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది.