స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో రిస్క్ ఎక్కువ. కానీ, దీర్ఘకాలం పాటు (పదేళ్లు అంతకుమించి) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బలమైన రాబడులు సొంతం చేసుకోవచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు కనుక మధ్యలో మార్కెట్ల పతనంతో కలత చెందాల్సిన పని ఉండదు. అప్పుడు మీ పెట్టుబడితో ఎక్కువ యూనిట్లు సమకూరుతాయి. కేవలం దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారికే ఇవి అనుకూలం.
స్వల్పకాలం కోసం ఇవి అనుకూలం కాదు. వీటిల్లో అస్థిరతులు, రిస్క్ ఎక్కువ. కనుక రాబడుల కోసం రిస్క్ తీసుకునే ధోరణి ఉన్న వారు తమ పోర్ట్‌ఫోలియోలో వీటిని చేర్చుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
రాబడులు
నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ డైరెక్ట్ ప్లాన్‌లో గడిచిన ఏడాది కాలంలో రాబడి 50 శాతంగా ఉంది. అంటే పెట్టుబడిని ఏడాదిలోనే 50 శాతం వృద్ధి చేసింది. మూడేళ్ల కాలంలోనూ ఏటా 32 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఐదేళ్లలో చూసుకుంటే ఏటా 38 శాతం, ఏడేళ్లలో 26 శాతం, పదేళ్లలో 25 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఈ పథకంలో డైరెక్ట్ ప్లాన్ 2013 జనవరిలో ప్రారంభమైంది. రెగ్యులర్ ప్లాన్ అయితే 2010లోనే మొదలైంది. రెగ్యులర్ ప్లాన్‌లోనూ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏటా 23 శాతం మేర రాబడి వచి్చంది. ఈ పథకంలో సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం రూ.100 నుంచి (ఎస్‌డబ్ల్యూపీ) వెనక్కి తీసుకోవచ్చు.
పెట్టుబడుల విధానం..
స్మాల్ క్యాప్ పథకం కనుక పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని చిన్న కంపెనీలకే కేటాయిస్తుంది. కానీ, పోర్ట్‌ఫోలియో చూస్తే అలా అనిపించదు. మొత్తం పెట్టుబడుల్లో 32 శాతమే స్మాల్‌క్యాప్‌లో కనిపిస్తాయి. రిస్క్‌ను తగ్గించడం కోసం ఫండ్ మేనేజర్లు ఈ విధానం అనుసరిస్తున్నారు. పైగా ఈ పథకం ఎంపిక చేసుకునే స్టాక్స్ అన్నీ దాదాపుగా భవిష్యత్తులో మిడ్, లార్జ్‌క్యాప్‌గా అవతరించే సామర్థ్యాలున్నవే. ఈ పథకం పెట్టుబడుల చరిత్రను గమనిస్తే ఇలాంటివి పదుల సంఖ్యలో కనిపిస్తాయి. భవిష్యత్తులో మల్టీబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.61,000 కోట్లున్నాయి. ఇందులో 95.99 శాతం మేర ఈక్విటీలకు కేటాయించింది. మార్కెట్ల కరెక్షన్‌లో పెట్టుబడుల కోసం 4 శా తం నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 17 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లో 50.57 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 32.56 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఇండస్ట్రియల్స్ కంపెనీలకు అత్యధికంగా 25 శాతం కేటాయించింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 15 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 14.47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 13.74 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment