
కేవలం పౌరసత్వం మార్చుకుందనే కక్ష కట్టిన చైనా.. ఆమెకు ఘోరమైన నష్టం తెచ్చిపెట్టింది.
సొంత దేశం కోసం తప్ప.. వ్యక్తిగతంగా బాగుపడకూడదంటూ బిలియనీర్లపై పగబట్టింది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా అపర కుబేరులపై ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రియలిటీ కింగ్‌గా ఉన్న ‘ఎవర్‌గ్రాండ్’ సైతం దివాళా దిశగా వెళ్లడం, అలీబాబా జాక్ మా లాంటి వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం లాంటివి గమనిస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో.. చైనా దెబ్బకి హాంకాంగ్‌కు చెందిన ఓ బిలియనీర్.. తన సంపదలో దాదాపు 40 వేల కోట్లకు పైగా కోల్పోయింది.
హువాబావో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్.. హాంకాంగ్ ట్రేడింగ్‌లో షేర్ల ధరలు ఏకంగా 67 శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీ చైర్‌ఉమెన్ చూ లమ్ వైయియూ(52) ను క్రమశిక్షణ ఉల్లంఘనల కింద చైనా ప్రభుత్వం విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు దారుణాతిదారుణంగా పతనం అవుతున్నాయి. చైనా దర్యాప్తు మొదలైందన్న విషయం తెలిశాక.. ఇన్వెస్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయని, అందుకే ఈ ఎఫెక్ట్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.
చైనా హునాన్ ప్రావిన్స్‌లోని లెయియాంగ్ సిటీకి చెందిన సూపర్‌వైజరీ కమిటీ ఒకటి.. చూ ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చూ లమ్ వైయియూ.. హువాబావో కంపెనీ చైర్‌ఉమెన్ మాత్రమే కాదు.. 71 శాతం వాటాతో సీఈవోగా కూడా కొనసాగుతున్నారు. నవంబర్‌లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న సంపద.. ఇవాళ్టి(ఫిబ్రవరి 3)నాటికి 2.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే స్టాక్ ధరలు మరింత దిగజారుతాయనే భయంతో దర్యాప్తు దేని మీద సాగుతుందన్న వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది కంపెనీ. tobacco fragrance queenగా చూ కి మరో పేరుంది. అయితే హువాబావో కంపెనీ తరపున ఈ-సిగరెట్లను మైనర్లకు విక్రయించడం మీద అభ్యంతరాల నడుమే చైనా ప్రభుత్వం ఆమెపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. కానీ, చైనా పౌరసత్వం వదులుకుని మరీ ఆమె బిలియనీర్‌గా ఎదగడం ఓర్వ లేకే చైనా.. ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందన్నది హాంకాంగ్ వర్గాల కథనం.
చూ కెరీర్
చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో పుట్టిన చూ.. ఆపై హాంకాంగ్ పౌరసత్వం తీసుకుంది. కాలేజీ రోజుల్లోనే హువాబావో పేరిట చూ లాం వైయియూ.. అత్తరు వ్యాపారాన్ని కొనసాగించింది. 1966లో కంపెనీని మొదలుపెట్టిన ఆమె.. పదేళ్ల తర్వాత కంపెనీని ఐపీవోకి తీసుకెళ్లింది. ఐదవ సీపీపీ సీసీసీ (Chinese People's Political Consultative Conference Committee)లో ఆమె సభ్యురాలిగా కూడా పని చేసింది. వారసుడిని వ్యాపారంలోకి దింపాలనే ప్రయత్నాల్లో ఉండగానే.. ఆమెకు ఈ ఎదురు దెబ్బ తగడం విశేషం.