ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పోర్ట్‌ఫోలియో నాణ్యత మెరుగుపడినప్పటికీ, వాటి స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ)లు గత ఏడాది నవంబర్, డిసెంబర్‌ల్లో 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది.
బ్యాంకుల రుణ నిబంధనావళి పరిధిలోకి హౌసింగ్ ఫైనాన్షియర్‌లను తీసుకు వస్తుండడం దీనికి నేపథ్యమని నివేదిక విశ్లేషించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గత ఏడాది నవంబర్ 12 వతేదీన రుణదాతలు అందరికీ వర్తించేలా కఠినమైన రుణ నాణ్యత రిపోర్టింగ్ నిబంధనలను ప్రవేశపెట్టింది.
తద్వారా హౌసింగ్ ఫైనాన్షియర్లు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్‌బీఎఫ్‌సీ) వాణిజ్య బ్యాంకుల నిబంధనావళి పరిధిలోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనలను 2021 డిసెంబర్ 31నాటికి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ గడువును 2022 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ఆర్‌బీఐ 2022 ఫిబ్రవరి 15వ తేదీన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో క్రిసిల్ ఆవిష్కరించిన నివేదికలోకి కొన్ని
ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► మొండి బకాయిల్లో 2021–22 ప్రస్తుత (మార్చి) త్రైమాసికం ముగిసే నాటికి ఒక స్థిరీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది.
► 2021 నవంబర్ తర్వాత కేవలం నెలరోజుల్లో (2021 డిసెంబర్ 31 నాటికి) చౌక గృహ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి స్థూల మొండిబకాయిలు 140 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఇతర ఫైనాన్షియల్ కంపెనీల విషయంలో ఏకంగా ఈ పెరుగుదల 3.3 శాతంగా ఉంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల అకౌంట్ల సవరణలు దీనికి కారణ. ఇలాంటి పరిస్థితి లేకపోతే ఎన్‌పీఏలు డిసెంబర్ నాటికి కేవలం 2.6 శాతం పెరిగేది. దీని ప్రకారం, కొత్త నిబంధనల నేపథ్యం వల్ల ఎన్‌పీఏలు 70 బేసిస్ పాయింట్లు పెరిగాయన్నమాట. అయితే 2022 మార్చి ముగిసే నాటికి 3 శాతానికి ఎన్‌పీఏలను పరిమితమయ్యే అవకాశం ఉంది.
► మరో రకంగా చెప్పాలంటే, కొత్త నిబంధనలు లేకపోతే రుణ నాణ్యత 40 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం కూడా ఉంది.
►హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలను వాణిజ్య బ్యాంకుల పరిధిలోనికి తీసుకురావడానికి సంబంధించి గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించినప్పటికీ, ఈ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే, ఇప్పటికే పలు హౌసింగ్ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేస్తున్నాయి.
► రుణాల విషయంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అనవసర వ్యయాల కట్టడి, వసూళ్ల విషయంలో మరింత వ్యవస్థాపరమైన పటిష్టత వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
► కాగా, ఎన్‌బీఎఫ్‌సీలకన్నా హెచ్‌ఎఫ్‌సీల రుణ నాణ్యత కొంత మెరుగ్గా వుండే అవకాశాలు ఉన్నాయి.
► రుణాల విషయంలో 95 శాతం ఉన్న 35 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను క్రిసిల్ తన నివేదిక కోసం అధ్యయనం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment