ముంబై: వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ గృహ రుణాలు (రుణ గ్రహీతలు చెల్లించాల్సిన మొత్తం) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.19.36 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది మే నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై రేట్లు పెరిగాయి. 2022 మార్చి చివరికి గృహ రుణాలు రూ.16.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి చివరికి రూ.14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఈ మేరకు ఆర్‌బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల్లో 20.6 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 12.6 శాతంతో పోలిస్తే పెరిగింది. కన్జ్యూమర్ రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా, వాహన రుణాలన్నీ పర్సనల్ లోన్ కిందకు వస్తాయి. పరిశ్రమలకు రుణాల మంజూరు 5.7 శాతం పెరిగింది.
పెద్ద పరిశ్రమలకు ఇది 3 శాతంగా ఉంది. మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాల మంజూరులో 19.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణ వితరణ 12.3 శాతం పెరిగింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రుణాల మంజూరు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15.4 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంతో పోలిస్తే మంచి పురోగతి కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment