
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎల్‌అండ్‌టీ మ్యుచువల్ ఫండ్‌ను (ఎల్‌అండ్‌టీ ఎంఎఫ్) హెచ్‌ఎస్‌బీసీ అసెట్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఎస్‌బీసీ ఏఎంసీ) కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 425 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,192 కోట్లు) వెచ్చించనుంది. ఎల్‌అండ్‌టీ ఎంఎఫ్‌లో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (ఎల్‌టీఎఫ్‌హెచ్) అనుబంధ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ (ఎల్‌టీఐఎం)కు 100 శాతం వాటాలు ఉన్నాయి.
వీటిని విక్రయించేందుకు హెచ్‌ఎస్‌బీసీ ఏఎంసీతో ఎల్‌టీఎఫ్‌హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సీఈవో హితేంద్ర దవే తెలిపారు. అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రుణ వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్‌టీఎఫ్‌హెచ్ ఎండీ దీనానాథ్ దుబాషి వివరించారు.
హెచ్‌ఎస్‌బీసీకి ఇప్పటికే భారత్‌లో అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి దీని నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ సుమారు రూ. 11,700 కోట్లు. దీని పరిమాణం ఎల్‌టీఎంఎఫ్‌తో పోలిస్తే ఆరో వంతు ఉంటుంది. డీల్ అనంతరం హెచ్‌ఎస్‌బీసీ ఏఎంసీ దాదాపు రూ. 1 లక్ష కోట్ల ఏయూఎంతో దేశంలోనే 12వ అతి పెద్ద ఫండ్ హౌస్‌గా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment