స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్ఛేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాల పాటు ఇదే వారంలో జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. గత వారాంతాన విడుదలైన దేశ క్యూ2(జూలై– సెప్టెంబర్)జీడీపీ గణాంకాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగడం, అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బిడైన్ పాలన దిశగా అడుగులు వేయడం లాంటి అంశాలతో గతవారం సెన్సెక్స్ 267 పాయింట్లను, నిఫ్టీ 110 పాయింట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే.
తగిన స్థాయిలో వాహన విక్రయాలు
దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం తమ నవంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్ లేలాండ్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పండుగ సీజన్‌తో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి కనబడే అవకాశం ఉందని, వ్యవస్థలో రికవరీతో వాణిజ్య వాహన అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో మెరుగైన వర్షాలతో ట్రాక్టర్ అమ్మకాలు పెరిగి ఉండొచ్చని, ద్వి – చక్ర వాహన విభాగపు అమ్మకాల్లో మాత్రం ఫ్లాట్ లేదా స్వల్ప క్షీణత నమోదు కావచ్చని వారంటున్నారు.
పాలసీ సందర్భంగా జాగరూకత!
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ సమావేశం డిసెంబర్ 2న (బుధవారం) ప్రారంభమవుతుంది. కమిటీ డిసెంబర్ 4న(శుక్రవారం)తన నిర్ణయాలు ప్రకటించనుంది. మూడురోజుల పాటు జరిగే ఈ సమావేశ నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌కు ఎంతో కీలకం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సర్దుబాటు ద్రవ్య విధానానికి కట్టుబడుతూ పాలసీ కమిటీ కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 4 శాతం గానూ, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.
అండగా ఎఫ్‌ఐఐల పెట్టుబడులు..
ఈ నవంబర్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) రూ. 65,317 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలను కొన్నారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చే అంశమని నిపుణులంటున్నారు. అమెరికా, యూరప్ దేశాల కేంద్ర బ్యాంకుల మానిటరీ పాలసీ సమావేశాల నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు స్వల్పకాలం పాటు దేశీయ మార్కెట్లోకి తమ పెట్టుబడులను తగ్గించుకోవచ్చని అంటున్నారు. అయితే దీర్ఘకాలం దృష్ట్యా భారత మార్కెట్ల పట్ల ఎఫ్‌ఐఐలు బుల్లిష్‌గానే ఉన్నట్లు నిఫుణులంటున్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం...
ఈ వారంలో అమెరికా, ఐరోపా, చైనాతో జపాన్ దేశాలు నవంబర్ నెల పీఎంఐ గణాంకాలను విడుదల చేయనున్నాయి. వారాంతపు రోజున యూఎస్ నిరుద్యోగ గణాంకాలు, యూరప్ దేశాల అక్టోబర్ రిటైల్ విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. అలాగే ఓపెక్ సమావేశం కూడా నవంబర్ 30న ప్రారంభమై, డిసెంబర్ 1న ముగుస్తుంది. వ్యాక్సిన్ ఆశలతో నవంబర్‌లో క్రూడాయిల్ ధరలు 28 శాతం పెరిగాయి. దీంతో ఓపెక్ క్రూడ్ ధరలను పెంచదని నిపుణులు భావిస్తున్నారు.
బుధవారం బర్గర్ కింగ్ ఐపీఓ ప్రారంభం...
ప్రముఖ చెయిన్ రెస్టారెంట్ల సంస్థ బర్గర్ కింగ్ ఐపీఓ డిసెంబర్ 2 న ప్రారంభమై డిసెంబర్ 4 న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.59 – 60 గా నిర్ణయించారు. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.810 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 450 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ప్రమోటర్ల వాటాలో క్యూఎస్‌ఆర్ ఆసియా పీటీఈ లిమిటెడ్ 6 కోట్ల షేర్లను అమ్మనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీఓ అనంతరం డిసెంబర్ 14న షేర్లను ఎక్చ్సేంజీల్లో లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది(2020)లో బర్గర్ కింగ్ ఐపీఓ 14వది.
గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు. మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ యధావిధిగా పనిచేస్తుంది.
ఒడిదుడుకుల ట్రేడింగ్..!
Published Mon, Nov 30 2020 1:51 AM | Last Updated on Mon, Nov 30 2020 1:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment