2029–30 నాటికి ఈ మొత్తానికి డెలాయిట్ తాజా నివేదిక వెల్లడి
ముంబై: కార్పొరేట్ ట్రావెల్ రంగం భారత్‌లో 2029–30 నాటికి ఏటా 10.1 శాతం వార్షిక వృద్ధితో 20.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. సాంకేతికత తోడుగా వ్యక్తిగతీకరించిన, స్థిర పరిష్కారాలు పరిశ్రమను నడిపిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ రంగం 10.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 45 మంది ట్రావెల్ మేనేజర్లు, వివిధ రంగాలకు చెందిన 160కిపైగా కార్పొరేట్ ట్రావెలర్స్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందింది.
నివేదిక ప్రకారం.. మహమ్మారి తర్వాత వ్యాపారాలు హైబ్రిడ్ వర్క్ మోడళ్లతో తమ ప్రయాణ వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నందున.. భారత కార్పొరేట్ ట్రావెల్ సెక్టార్ పరిశ్రమను ఆవిష్కరణ, వ్యయ సామర్థ్యం, స్థిరత్వం యొక్క కొత్త శకంలోకి నడిపించడంలో ట్రావెల్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (టీఎంసీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే చాట్‌బాట్‌లు, వాయిస్–సహాయక బుకింగ్ సిస్టమ్‌లు, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి మరింత లోతుగా, వేగంగా నిమగ్నం అయ్యే కొత్త తరం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి టీఎంసీలు తమ వ్యూహాలను పునరుద్ధరించాయి.
ఒకే కంపెనీ రూ.2,600 కోట్లు..
చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (250 మంది ఉద్యోగుల వరకు) ప్రయాణ ఖర్చు సంవత్సరానికి రూ.1 కోటికి చేరుకుంటోంది. పెద్ద సంస్థలు (250–5,000 ఉద్యోగులు) ప్రయాణ ఖర్చుల కోసం ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నాయి. భారీ పరిశ్రమలకు (5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు) ప్రయాణ ఖర్చులు ఉద్యోగుల సంఖ్యకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. అగ్రశ్రేణి 100 లిస్టెడ్ సంస్థల విశ్లేషణలో ప్రముఖ ఐటీ సంస్థ అత్యధికంగా 2022–23లో రూ.2,600 కోట్లకు పైగా వెచ్చించినట్లు నివేదిక పేర్కొంది. సహాయక సేవలకు డిమాండ్ పెరుగుతోంది.
సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది టాక్సీ సేవలను కోరారు. 63 శాతం మంది ప్రయాణ ప్లాట్‌ఫామ్‌లపై వీసా సహాయం డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సమగ్ర ప్రయాణ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఐటీ సేవలు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజనీరింగ్, ఏవియేషన్, ఆయిల్–గ్యాస్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్స్ రంగాలు కార్పొరేట్ ప్రయాణ వ్యయాలను పెంచే అగ్ర పరిశ్రమలుగా గుర్తింపు పొందాయి. భారత్‌లోని టాప్ 100 లిస్టెడ్ సంస్థలలో ప్రయాణ వ్యయంలో ఈ రంగాల వాటా 86 శాతం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment