ఐదేళ్లలో రెట్టింపు
2028 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరిక
24 కోట్లకు చేరనున్న పెయిడ్ యూజర్ల సంఖ్య
విన్‌జో నివేదిక
న్యూఢిల్లీ: భారతీయ గేమింగ్ పరిశ్రమ వార్షికాదాయం ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది. 2028 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2023లో ఇది 3.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ విన్‌జో సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ’ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2024’ ప్రకారం 2028 నాటికి పెయిడ్ యూజర్ల సంఖ్య 24 కోట్లకు చేరనుంది. 2023లో ఇది 14.4 కోట్లుగా ఉంది.
‘భారతీయ గేమింగ్ రంగంలో 1,400 గేమింగ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో 500 గేమింగ్ స్టూడియోలు ఉన్నాయి. 2028 నాటికి గేమింగ్‌కి సంబంధించి వార్షికాదాయం 6 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నాయి‘ అని నివేదిక తెలిపింది. రిపోర్టు ప్రకారం ప్రొఫెషనల్ ప్లేయర్ల సంఖ్య 2023లో 500గా ఉండగా వచ్చే అయిదేళ్లలో 2.5 రెట్లు పెరగనుంది. ఈ–స్పోర్ట్స్‌కి ప్రభుత్వ గుర్తింపు లభించడంతో పాటు ఈ–స్పోర్ట్స్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు కొన్ని రాష్ట్రాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి.
నాలుగేళ్లలో భారీగా డౌన్‌లోడ్స్..
‘2019 నుంచి 2023 మధ్య కేవలం నాలుగేళ్ల వ్యవధిలో భారత్‌లో గేమ్ డౌన్‌లోడ్లు 565 కోట్ల నుంచి 950 కోట్లకు చేరాయి. దీంతో అంతర్జాతీయంగా గేమ్ డౌన్‌లోడ్స్‌లో భారత వాటా గతేడాది ఏకంగా 16 శాతానికి చేరింది. 450 కోట్లు (7.6 శాతం మార్కెట్ వాటా), 440 కోట్లు (7.4 శాతం మార్కెట్ వాటా) డౌన్‌లోడ్స్‌తో బ్రెజిల్, అమెరికా తర్వాత స్థానాల్లో ఉన్నాయి‘ అని రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం దేశీయంగా 56.8 కోట్ల మంది గేమర్స్, 15,000 మంది పైచిలుకు గేమ్ డెవలపర్లు, ప్రోగ్రామర్లు ఉన్నారు.
మూడేళ్ల క్రితం ప్రతి అయిదుగురు గేమర్లలో ఒక్క మహిళ మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం గేమర్లలో 40 శాతం మంది మహిళలు ఉంటున్నారు. ‘భారత గేమింగ్ మార్కెట్లో మొబైల్ గేమింగ్ వాటా 90 శాతంగా ఉంది. అదే అమెరికాలో ఇది 37 శాతంగా, చైనాలో 62 శాతంగా ఉంది. 50 శాతం మంది గేమర్లు 18–30 ఏళ్ల మధ్య వయస్సువారే‘ అని నివేదిక వివరించింది. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో వచ్చే 10 ఏళ్లలో మరో 2.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. ప్రస్తుతం 1 లక్ష మంది నిపుణులు ప్రత్యక్షంగా, పరోక్షంగా గేమింగ్‌తో ఉపాధి పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment