2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకూ
భారత్‌కు ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
పత్యక్ష పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలానికిపైగా విదేశీ పెట్టుబడులకు భారత్ కీలకంగా నిలుస్తోంది. దీంతో భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) భారీగా తరలివస్తున్నాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకూ చూస్తే ఎఫ్‌డీఐలు ట్రిలియన్ డాలర్లను అధిగమించాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక కీలక పెట్టుబడుల ప్రాంతంగా భారత్ నిలుస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం విదేశీ పెట్టుబడులలో భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా ఈక్విటీలు, ఆర్జనతోపాటు ఇతర మూలధనాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం తదితరాల ద్వారా భారత్ ఆకట్టుకున్న ఎఫ్‌డీఐలు 1,033.4 బిలియన్ డాలర్లను తాకాయి.
మారిషన్ కీలకం
మొత్తం ఎఫ్‌డీఐలలో 25 శాతం మారిషస్ నుంచి లభించగా.. 24 శాతంతో తదుపరి సింగపూర్ నిలిచింది. ఈ బాటలో యూఎస్ వాటా 10 శాతంకాగా.. నెదర్లాండ్స్ 7 శాతం, జపాన్ 6 శాతం, యూకే 5 శాతం, యూఏఈ 3 శాతం, కేమన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ 2 శాతం చొప్పున తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. విలువపరంగా బిలియన్ డాలర్లలో మారిషన్ వాటా 177.18కాగా.. సింగపూర్ 167.47, యూఎస్ 67.8గా నమోదయ్యాయి. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకున్న ప్రధాన రంగాలలో సరీ్వసెస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, కన్‌స్ట్రక్షన్ డెవలప్‌మెంట్, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ నిలిచాయి.
2014 నుంచి స్పీడ్
వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2014 నుంచి పదేళ్లలో భారత్‌కు మొత్తం 667.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు తరలివచ్చాయి. అంతక్రితం దశాబ్ద కాలం(2004–2014)లో నమోదైన విదేశీ పెట్టుబడులతో పోలిస్తే ఇవి 119 శాతం అధికం. 2014–24 కాలంలో తయారీ రంగంలోకి తరలి వచి్చన ఈక్విటీ పెట్టుబడులు 165.1 బిలియన్ డాలర్లు. ఇది అంతక్రితం పదేళ్లలో నమోదైన 97.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే 69 శాతం వృద్ధి. పెట్టుబడిదారుల సానుకూల దేశంగా నిలవడం ద్వారా భారత్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. సంబంధిత వర్గాలతో చర్చలు, సమావేశాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్‌డీఐ విధానాలను సవరిస్తోంది. ఇది సానుకూల అంశంగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
2025లోనూ
వచ్చే కేలండర్ ఏడాది(2025)లోనూ భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి వచ్చే అవకాశముంది. ఇందుకు పటిష్ట స్థూల ఆర్థిక గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి బలిమి, పీఎల్‌ఐ పథకాలు ప్రభావం చూపనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లున్నప్పటికీ విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ ప్రాంతంగా నిలుస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అయితే యూఎస్‌లో విధానాల సవరణ, చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతికి మద్దతుగా సహాయక ప్యాకేజీలు వంటి అంశాల కారణంగా భారత్‌కు ఎఫ్‌డీఐల రాక మందగించే వీలున్నట్లు డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త ఆర్.మజుందార్ అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రస్తుతం కొన్ని రంగాలలో ఎఫ్‌డీఐలపై నిషేధం అమలవుతోంది. లాటరీ, గ్యాంబ్లింగ్, చిట్ పండ్స్, నిధి కంపెనీ, సిగార్ల తయారీ, పొగాకుతో తయారయ్యే సిగరెట్లు తదితర విభాగాలలో విదేశీ పెట్టుబడులను అనుమతించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment