
2029 నాటికి రెండు రెట్ల వృద్ధి
9.1 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుంది
86 శాతం రియల్ గేమింగ్ నుంచే
వింజో గేమ్స్, ఐఈఐసీ అంచనా
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ హద్దే లేదన్నట్టుగా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ వింజోగేమ్స్, ఐఈఐసీ సంయుక్త అంచనా ప్రకారం.. 2024లో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ విలువ 3.7 బిలియన్ డాలర్లుగా ఉంటే (సుమారు రూ.32,000 కోట్లు).. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.80,000 కోట్లు) వృద్ధి చెందనుంది. ముఖ్యంగా 86 శాతం వాటాతో రియల్ మనీ గేమ్స్ (ఆర్‌ఎంజీ) విభాగం ఈ మార్కెట్‌ను శాసించనుంది.
శాన్‌ఫ్రాన్సిస్కోలో గేమ్ డెవలపర్ల సదస్సులో భాగంగా ఈ సంయుక్త నివేదికను వింజోగేమ్స్, ఐఈఐసీ విడుదల చేశాయి. ‘‘భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ అసాధారణ వృద్ధి పథంలో కొనసాగుతోంది. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్ల మార్కెట్‌తో.. ఇన్వెస్టర్లకు 63 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలను అందించనుంది. టెక్నాలజీ పరమైన ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు (ఐపీ), యూజర్లతో అనుసంధానం (ఎంగేజ్‌మెంట్) ద్వారా గేమింగ్‌కు భారత్‌ను బలమైన కేంద్రంగా (పవర్‌హౌస్) మార్చేందుకు వింజో కట్టుబడి ఉంది’’అని వింజో సహ వ్యవస్థాపకుడు పవన్ నంద తెలిపారు.
59 కోట్ల యూజర్లు..
ఈ నివేదికలోని సమాచారం ప్రకారం చూస్తే దేశంలో 59.1 కోట్ల మంది గేమర్స్ ఉన్నారు. అంతర్జాతీయంగా ఉన్న గేమర్లలో 20 శాతం ఇక్కడే ఉన్నారు. 11.2 బిలియన్ మొబైల్ గేమ్ యాప్ డౌన్‌లు నమోదయ్యాయి. 1,900 గేమింగ్ కంపెనీలతో ఈ రంగం సుమారుగా 1.3 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం 3 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం గమనార్హం.
ప్రస్తుతం రూ.32 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్లో రియల్ మనీ గేమ్స్ (ఆర్‌ఎంజీ) వాటా 85.7 శాతంగా ఉంటే, 2029 నాటికి రూ.80 వేల కోట్ల మార్కెట్‌లోనూ 80 శాతం వాటా కలిగి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. నాన్ రియల్ మనీ గేమ్స్ మార్కెట్ వాటా ఇదే కాలంలో 14.3 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దేశంలో ఏకైక లిస్టెడ్ గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్ అంతర్జాతీయంగా లిస్టెడ్ గేమింగ్ కంపెనీల్లో అధిక ప్రీమియం వ్యాల్యుయేషన్‌ను సొంతం చేసుకున్నట్టు తెలిపింది.
‘‘ప్రస్తుత ఆన్‌లైన్ గేమింగ్ రంగం మార్కెట్‌కు (32వేల కోట్లు) నజారా మాదిరే విలువను ఆపాదించినట్టయితే.. అప్పుడు ఇతర గేమింగ్ కంపెనీల ఐపీవోల రూపంలో ఇన్వెస్టర్లకు 26 బిలియన్ డాలర్ల విలువ సమకూరనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకుతోడు, బలపడుతున్న గేమ్ డెవలపర్ ఎకోసిస్టమ్, సానుకూల నియంత్రణ వాతావరణంతో 2034 నాటికి ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ పరిమాణం 60 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 20 లక్షల ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుంది’’అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment