పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏప్రిల్–మే నెలల్లో రెండు దశాబ్దాల కనిష్టానికి పడినప్పుడు, ఈ పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. తక్కువ ధర వద్ద భారీగా ముడి చమురును కొనుగోలుచేసి, తన మూడు వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వల క్షేత్రాలనూ నింపుకుందని వెల్లడించారు. తద్వారా రూ.5,000 కోట్లను భారత్ పొదుపుచేయగలిగిందని ఆయన వివరించారు. భారత్ తన మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదేశంగా భారత్ కొనసాగుతోంది. ఆయా అంశాలపై రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
► అంతర్జాతీయంగా భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలను అవకాశంగా తీసుకుని ఏప్రిల్, మే నెలల్లో భారత్ 16.71 మిలియన్ బేరళ్ల (ఎంబీబీఎల్)ను కొనుగోలుచేసింది. విశాఖపట్నం, మంగళూరు, పద్దూర్‌లలో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వల క్షేత్రాలను నింపుకుంది.
► సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఇరాక్‌ల నుంచి ఈ కొనుగోళ్లు జరిగాయి.
► 2020 జనవరిలో బేరల్ 60 డాలర్లకు కొంటే, తదుపరి తక్కువ ధరకు కొనుగోళ్ల వల్ల సగటు వ్యయం బేరల్‌కు 19 డాలర్లకు పడిపోయింది.
► మంగళూరు నిల్వల సామర్థ్యం మొత్తం 1.5 మిలియన్ టన్నులు. మూడింటిలో పద్దూర్ నిల్వల సామర్థ్యం 2.6 మిలియన్ టన్నులు. విశాఖ విషయంలో ఈ సామర్థ్యం 1.33 మిలియన్ టన్నులు.
► 5.33 మిలియన్ టన్నుల అత్యవసర నిల్వ భారత్ 9.5 రోజుల అవసరాలకు సరిపోతుంది. భారత్ రిఫైనరీలు 65 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలను నిర్వహిస్తాయి. మూడు నిల్వ క్షేత్రాలనూ కలుపుకుంటే, 87 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలు భారత్ వద్ద ఉంటాయి. ఇంధన భద్రతకు సభ్య దేశాలకు ఐఈఏ నిర్దేశిస్తున్న చమురు నిల్వల స్థాయికి ఈ పరిమాణం దాదాపు చేరువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment