న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో పేలవ పనితీరును కనబరిచింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరికన్నా తక్కువకు పడిపోయి 57.8కి చేరింది. సూచీ ఫిబ్రవరిలో 12 నెలల గరిష్ట స్థాయి 59.4ను చూసిన సంగతి తెలిసిందే.
కొత్త బిజినెస్ ఆర్డర్లు అంతంత మాత్రంగానే పెరిగినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన వరుసగా 20 నెలల నుంచి సూచీ వృద్ధి ధోరణిలో పయనిస్తోంది.
తయారీ–సేవల రంగం కలిపినా డౌన్!
కాగా, తయారీ–సేవల రంగం కలిపినా ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59.0 వద్ద ఉంటే, మార్చిలో 58.4కు పడిపోయింది. మరోవైపు ఒక్క తయారీ రంగం చూస్తే మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది.
ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. 400 మంది తయారీదారుల ప్యానల్‌లో కొనుగోళ్లు జరిపే మేనేజర్‌ల స్పందన ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదు చేస్తారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా 60%. పరిశ్రమల రంగం వాటా దాదాపు 15% అయితే, అందులో తయారీ రంగం వెయిటేజ్ 70% ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment