న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో (2026 నాటికి) దేశీయంగా 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం 70–80 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్లు (చిప్‌లు) అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2022 సదస్సుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.
దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా సెమీకాన్ ఇండియా తొలి సదస్సు ఏప్రిల్ 29–మే 1 మధ్య బెంగళూరులో జరగనుంది. ఈ సదస్సులో పలు దిగ్గజ సెమీకండక్టర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
‘డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విజన్ డాక్యుమెంట్ ప్రకారం 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీని ప్రకారం చూస్తే దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగమే 70–80 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.
సెమీకాన్ ఇండియా పథకం కింద భారత్‌లో దాదాపు రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్ చిప్, డిస్‌ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అయిదు కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. వేదాంత ఫాక్స్‌కాన్ జేవీ, ఐజీఎస్‌ఎస్ వెంచర్స్, ఐఎస్‌ఎంసీ సంస్థలు..ఎలక్ట్రానిక్ చిప్ తయారీ ప్లాంట్లను పెట్టే యోచనలో ఉన్నాయి. వేదాంత, ఎలెస్ట్ సంస్థలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిలో ఉపయోగించే డిస్‌ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment